- ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం
- స్వస్థలం హనుమకొండ జిల్లా టేకులగూడెం
హనుమకొండ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ తొలి తరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీ స్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కేంద్ర మిలిటరీ ఇన్‌చార్జ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ సరిహద్దు ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకుల గూడెం గ్రామంలో నిరు పేద దళిత కుటుంబంలో జన్మించారు. దొరల వద్ద పాలేరుగా పనిచేశారు. రాతిమోట కొ ట్టారు. బ్యాండ్‌మేళం మేస్త్రీగా పనిచేశారు.
అసమానతలు పోయి, ప్రజలంతా ఒక్కటిగా బతకాలంటూ 1980లో పీపుల్స్‌వార్ పార్టీ లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీలో కీలక స్థాయికి చేరుకున్నారు. పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. తాజాగా బీజాపూర్, దంతెవాడ సరి హద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్ట్‌లో చని పోయారు. అందులో ఏసోబు కూడా ఉన్న ట్లు దంతెవాడ ఎస్పీ బుధవారం తెలిపారు. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ నుంచి టేకులగూడెంకు ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధు వులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.