- మృతిచెందాడని భావిస్తున్న మావోయిస్టు సత్యం గావ్‌డే
- ప్రకటన విడుదల చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు
రాయ్‌పూర్/ మేడ్చల్, జనవరి 23 (విజయక్రాంతి): ఒడిశా -ఛత్తీస్‌గఢ్ సరిహద్దు లోని గరియాబంద్‌లో ఈ నెల 19న భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండు మృతిచెందలేదని పోలీసులు ప్రకటించారు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ నేతలు చలపతి, దామోదర్ తదితరులు మృతిచెందారని ఇప్పటికే పోలీసులు ప్రకటించగా, గురువారం పాండు మృతిపైనా స్పష్టతనిచ్చారు. మృతుల జాబితా, చిత్రాలను విడుదల చేశారు.
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు తాము భావిస్తున్న మావోయిస్టు పాండు కాదని, మృతుడు మావోయిస్టు పార్టీ ధంతరీ గరియాబంద్ నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి సత్యం గావ్ డే అని తేల్చిచెప్పారు. మృతుడి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా ఉప్పర్ గ్రామమని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
మరోవైపు పాండు మృతదేహాన్ని తమకు అప్పగిస్తే, అంత్యక్రియలు నిర్వహించుకుంటామని ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే.. కాల్పుల్లో చనిపోయింది పాండు కాదని, సత్యం గావ్ డే అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించడంతో కుటుంబ సభ్యుల్లో అయోమయం నెలకొన్నది. పాండు స్వస్థలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాప్రా ల్.
తల్లిదండ్రులు నరసింహ, లక్ష్మి. ఆయనకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు పార్వతి, మీరా. చిన్నవయస్సులోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడ య్యాడు. 1985లో పాండు అడవి బాట పట్టాడు. పార్టీలో సాధారణ సభ్యుడిగా చేరిన పాండు అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంచార్జిగా పనిచేస్తున్నాడు.
ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన పలు విధ్వంసకర ఘటనలతో ప్రమేయం ఉందని పోలీసులు భావించి, ఆయన తలపై గతంలోనే 20 లక్షల రివార్డు ప్రకటించారు.
20కి చేరిన మృతుల సంఖ్య..
గిరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 20 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే.. భద్రతా దళాలు ఇప్పటివరకు 17 మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాయ్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా మూడు మృతదేహాల కోసం తిరిగి జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు.
మావోయిస్టుల కుట్ర భగ్నం..
భదత్రా దళాలే టార్గెట్‌గా మావోయిస్టులు పన్నిన కుట్ర భగ్నమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడ - అవపల్లి మధ్యలోని అటవీ ప్రాంతంలో గురువారం జవాన్లు 50 కిలోల ఐఈడీ, దంతెవాడ జిల్లాలోని అరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కిలోల ఐఈడీలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేశారు.
దీంతో పోలీస్ ఉన్నతాధికారులు దండకారణ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశాయి. మావోయిస్టుల కోసం అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఏజెన్సీలో గురువారం భద్రతా బలగాలు భారీగా మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులు టార్గెట్‌గా కోబ్రా 203 బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాయలిన్ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మెటగూడెం నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఓ గుహను కనిపెట్టారు. అక్కడ భారీగా మావోయిస్టుల డంప్‌ను గుర్తించారు. 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్స్, జనరేటర్ సెట్, లాత్ మెషిన్స్‌తో పాటు ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.