10-03-2025 12:02:00 AM
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (విజయశాంతి): నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందు పాతరలను అమర్చుతూ వారు ప్రాణాలు కోల్పోయే విధంగా మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.మూడు రోజుల క్రితం చత్తీస్గడ్ రాష్ట్రం,బీజాపూర్ జిల్లా, ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కుంజం పాండే తన సోదరితో కలిసి ఉట్లపల్లి అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి తీవ్ర గాయాల పాలయ్యి తన కుడి కాలును కోల్పోవడం జరిగింది.
సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న చర్ల పోలీసులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ఆమెకు వైద్య సేవలు అందించార న్నారు. ఆదివాసీ ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న మావోయిస్టుల తీరును ఎస్పీ తీవ్రంగా ఖండించారు.ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.ఏజెన్సీ ప్రాంత ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుంటే, నిషేధిత మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.