12-04-2025 07:06:44 PM
మిషన్ భగీరథ నీటిపైనే ప్రజల ఆశలు..
మండల కేంద్రంలో పలు గ్రామాలలో త్రాగునీటి కోసం కటకట..
మరమ్మతులు చేపట్టక ప్రజలకు ఇబ్బందులు..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): ఎండలు మండుతుండటంతో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. శనివారం ఒక్కరోజు మిషన్ భగీరథ నీరు రాకపోయేసరికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలలో ఇప్పటినుంచి త్రాగునీటి సమస్య తలెత్తుతున్నదని ఈ సమస్య మునుముందు మరింత జఠీలమవుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచినీటి కోసం స్థానికంగా 26 బోర్లు ఉండడం అందులో 8 బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కొన్ని బోర్లు మోటార్ మరమ్మతులు ఏర్పడటం ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్న ఎండాకాలం నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సమస్య తలెత్తుతున్నది.
మరో వైపు మరమ్మతుల కారణంగా అప్పుడప్పుడు మిషన్ భగీరథ నీటి సమస్యలు ఏర్పడుతుండటం ప్రజలకు తాగునీటి సమస్యలు తప్పడం లేదు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ, మండల ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో మండల గ్రామీణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా తీసుకోవాల్సిన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రజలు మండల అధికారులు, గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బందిని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.