08-04-2025 06:36:44 PM
60 మందికి పైగా ఆసుపత్రి పాలు..
బాన్సువాడ, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు..
మరికొందరిని నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలింపు..
ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశం..
బాధితులకు కొనసాగుతున్న చికిత్సలు..
పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ ల పరామర్శ..
కామారెడ్డి/బాన్సువాడ (విజయక్రాంతి): కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నర్సుల్లాబాద్ మండలం దుర్కి, అంకోల్, సంగేము హాజీపూర్ గ్రామాలకు చెందిన వారు సమీపంలో ఉన్న కల్లు దుకాణంలో కల్లు సేవించారు. కల్లు సేవించిన వారు మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో వారిని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లులో కలిపిన మత్తు పదార్థాలు డోస్ ఎక్కువ కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి అల్ఫోజోలం వంటి మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తుండగా మరోవైపు కల్లు మూస్తేదారులు కల్లులో కల్తీ చేసి విక్రయాలు చేపడుతుండడంతో కల్తీకల్లు బారిన పడి అస్వస్థతకు గురికావడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు.
తల్లిదండ్రులు బంధువులతో కలిసి చిన్న పిల్లలు సైతం కల్తీకల్లుకు బానిసలు అవుతున్నారు. కల్తీ కల్లు నియంత్రించేందుకు ఒకవైపు ఎక్సైజ్ అధికారులు మరోవైపు పోలీసులు కల్లులో కలిపే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటుండగా మరోవైపు వాటిని సరపర చేస్తున్న వారిని గుర్తించి కటకటాల పాలు చేస్తున్నారు. అయినా కల్తీకల్లు అమ్మేవారు మాత్రం గ్రామాలలో పట్టణాలలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా జరుపుతున్నారు. అల్ఫోజోలం డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను కల్తీకల్లులో కలిపి విక్రయాలు చేపడుతున్నారు. కల్తీకల్లు సేవించిన వారు అడాప్ట్ అవుతున్నారు.
మత్తులో పడి కుటుంబాలలో చిచ్చు రేపుతున్నారు. కల్తీకల్లుకు బానిసలై పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ తమ సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రజలకు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. మరోవైపు కల్తీకల్లుతో ముస్తే దారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు కల్లు మూస్తే దారులు నెలసరి మామూళ్లు ముట్ట చెప్పుతుండడంతో తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కూలి నాలి చేసుకునే ప్రజలు కల్తీకల్లు సేవిస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కల్తీ కల్లు విక్రయాల ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు వాపోతున్నారు.
60 మందికి పైగా కల్తీకల్లు బాధితులు..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దొరికి హాజీపూర్ అంకుల్ అంకుల్ తండా సంగెం గ్రామాలకు చెందిన వారు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా వ్యవహరించారు. వారిని స్థానికులు చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరి కొంతమంది సీరియస్ గా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయా గ్రామాల నుంచి బాధితులు 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవిన్యూ అధికారులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అస్వస్థతకు గురైన బాధితులకు బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు.
ఆందోళన చెందవద్దు.. -కిరణ్మయి, అదనపు కలెక్టర్ బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దుర్గి అంకోల్ అంకోల్ తండా, సంగేమ్, హాజీపూర్ గ్రామాలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారని వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యులు చికిత్సలు చేస్తున్నారని ఆమె తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కోరారు.
బాధితులను ఎప్పటికప్పుడు పరిశీలించిన సబ్ కలెక్టర్
కల్తీకల్లు తాగి అస్వస్థత గురైన బాధితులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ నరసింహారావు బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించారు.
కల్తీకల్లు విక్రయించిన వారిపై కేసు నమోదు, దుకాణాల సీజ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి, అంకోల్ తండా, అంకోల్, మరో గ్రామానికి చెందిన 60 మందికి పైగా రైతులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలోనే బాధితులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. కల్తీకల్లు విక్రయించిన లైసెన్స్ పొందిన వారిపై కేసు నమోదు చేసి వారి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ నరసింహారావు తెలిపారు. మూడు కల్తీకల్లు విక్రయించిన దుకాణాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.