calender_icon.png 23 December, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కోసం ‘ఎన్నీల ముచ్చట్లు’

11-07-2024 01:30:00 AM

కాళోజీ ఇంట్లో పురుడు పోసుకున్న మిత్రమండలిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లాశాఖ ప్రతినెల పున్నమివేళ ఎన్నీల ముచ్చట్లు అనే సాహితీ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభించాం. తెలంగాణ సాహి త్య చరిత్రలో ఒక నూతన అధ్యయనం ఈ ఎన్నీ ల ముచ్చట్లు. 2013 నుంచి తెలంగాణ ఆవిర్భా వం అనంతరం కూడా నిరంతరంగా కొనసాగిస్తూ ఇప్పటి వరకు 139 ఎన్నీల ముచ్చట్ల కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ కవితా సంకలనాలను ప్రచురిస్తుండడం గొప్పతనం. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఆరంభంలో ఎగిసిపడ్డ కవి కెరటాలకు ఈ వేదిక దర్పణంగా నిలిచింది. 

సరిగ్గా 2010లో 120 మంది కవుల కవిత్వంతో ‘వెల్లుబండ’ కవితాసంకలనం వెలువడిం ది. రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న విద్యార్థి, యువజన ఉద్యమకారులకు అండగా తెలంగాణ ఆకాంక్షల ప్రతిఫలంగా నిలిచింది. ‘వెల్లుబండ’ సంకలనాన్ని వెలువరించే ప్రయత్నంలో ఒక్కటైన కవిమిత్రుల చేతుల్లోంచి సాహితీ సోపతి మొదలయింది. ఎనిమిది మంది కవితాప్రియుల ఆలో చనల్లోంచి సాహితీ సోపతి సంస్థ ఆనాడు పురు డు పోసుకుంది. బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్, అధ్యాపకులు గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, శర్మ,కందుకూరి అంజయ్య, తదితర సాహిత్యకారుల నేతృత్వంలో సాహితీ సోపతి ఉద్యమ ఆకాంక్షను చాటింది. 

సాహితీ సోపతి ప్రచురుణగా మొదట కరీంనగర్ కాందాన్ పుస్తకం వచ్చింది. తెలంగాణ చరిత్రను, అస్థిత్వాన్ని చాటిచెప్పేందుకు ఎన్నీల ముచ్చట్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2013లో తెలంగాణ రచయితల వేదిక ఎన్నీల ముచ్చట్లు కవితాగానం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి పౌర్ణమి రోజున సాహిత్య గోష్టి జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన కవితలను సంకలనాలుగా సాహితీ సోపతి ప్రచురిస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సాహితీ సోపతి లాంటి ఉత్తమ అభిరుచి కలిగిన సారస్వత సంస్థల అవసరం మరింత పెరిగింది.

ఎన్నీల ముచ్చట్ల ద్వారా తెలంగాణ రచయితల వేదిక మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని చెప్పవచ్చు. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా రచయితలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఎందరో మహానుభావులు, కళాకారులు, రచయితలకు పుట్టినిల్లు అయిన కరీంనగర్ నిత్య చైతన్య ప్రాంతంగా చెప్పవచ్చు. ఇది అనేక పోరాటాలకు, ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఉద్యమాల పురిటి గడ్డ  అయిన కరీంనగర్‌లో ప్రారంభించిన వినూత్న కార్యక్రమమైన ఎన్నీల ముచ్చట్లు నేడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పాలకుల పనితీరు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న తదితర అంశాలను కవితల రూపంలో అందిస్తున్నది. 

 బల్మూరి విజయ సింహారావు, 

కరీంనగర్, విజయక్రాంతి