calender_icon.png 18 January, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికలకు ఎన్నో సవాళ్లు !

19-12-2024 12:00:00 AM

శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు తేవాలని తహతహలాడిన కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేస్తే  నాలుగు అడుగులు వెనకకు వేసినట్లయింది. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అనే ది మోదీ ప్రభుత్వ నినాదంగా గత కొన్ని సంవత్సరాలుగా  వినిపిస్తోంది. 2019సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భ వించిన తర్వాత దేశంలో మార్పు కోసం నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. కొత్త పార్లమెంటు భవనం లో వాడీ వేడి చర్చలతో యుద్ధ్దవాతావరణం తలపించే విధంగా కేంద్రంపై ఆరో పణలు, ప్రత్యారోపణల మధ్య ఎట్టకేలకు బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం అనుకున్న పని చేసింది.

ప్రజల్లో బహిరంగ చర్చ జరపకుండా, రాష్ట్రాల ఆమోదం లేకుండా రాజ్యాంగ దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని భావించి అపవాదు రాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి నివేదిస్తూ తీర్మానం చేసింది. న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి కేంద్రం ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా ఒక్క అడుగు ముం దుకు వేసింది. అయితే  బిల్లు ఆమోదం ఈ శీతాకాల సమావేశాల్లో ఆగినా .. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆగుతుందనే నమ్మకం లేదు. 

మొదట్లో అదే పద్ధతి

స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికలు 1951-52లో జరిగినాయి. అప్పటి నుండి 1970వరకు లోక్‌సభ,శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. రాజకీ య పార్టీల స్వార్థచింతనతో అర్ధాంతరంగా రద్దు చేసిన శాసనసభల వల్ల ఎన్నికల నిర్వహణ భారమైంది.  అయితే జమిలి ఎన్నిక ల నిర్వహణ విషయంలో అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు, సబ్బండ వర్గాలతో చర్చ లు పారదర్శకతకు పట్టంకట్టాలి. అందుకు దేశ వ్యాప్తంగా లోతైన చర్చ జరగాలి. నిజంగానే జమిలి ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల అవసరాన్ని గుర్తించి, దేశీయంగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షులుగా ఉన్న త స్థాయి సంఘాన్ని నియమించింది. ఈ సంఘం తన బాధ్యతను ఎప్పటిలోపు పూర్తి చేయాలన్నది ఎక్కడా ప్రస్తావించలేదు.

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వ హించాలంటే కనీసం ఏడు రాజ్యాంగ అధికరణలు సవరించాల్సి ఉంటుంది. సవర ణలు ఏవైనా రాజ్యాంగ మౌలిక స్వరూపా న్ని దెబ్బతీసేలా ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం కట్టబెట్టగానే మొదటి సమావేశంలో తీర్మానం చేస్తే 2029 ఎన్నికలకు జమిలి ఎన్నికలు నిర్వహించుకునేం దుకు సులువు అయ్యేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

మూడు దేశాల్లోనే జమిలి ఎన్నికలు

బీజేపీ ప్రభుత్వానికి తొందర  ఏమొచ్చిందో కానీ, ప్రపంచంలో కేవలం బెల్జి యం, స్వీడన్, దక్షిణాఫ్రికా లాంటి మూడు దేశాల్లో మాత్రమే జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశం అతిపెద్ద ప్రజా స్వామ్య దేశం. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే ముం దుగా 368వ అధికరణ నిర్దేశించిన ప్రకారమే జరగాలి. ఇందులో మెజార్టీ రాష్ట్రాలు ఆమోదిస్తే తప్ప నిబంధనలు మార్చడానికి వీలుండదు. అందుకేనేమో ముందుచూపుతో మోదీ 2024 ఎన్నికల్లో ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ నినాదం తీసుకొచ్చారు. చంద్రబాబు పూర్తిగా మద్దతు ఇచ్చినా సంపూర్ణ మెజార్టీ రాకపోయేసరికి మొదటి సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవే శ పెట్టడానికి జంకిందంటే అతిశయోక్తి కాదు.

ఒకవేళ ఏదో ఒక రకంగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించినా పలు సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఏ స్థాయిలో ప్రభుత్వానికి ఏ బాధ్యతలున్నాయి, వాటిని ఆయా ప్రభుత్వాలు ఎలా నెరవేరుస్తున్నా యి అనే మదింపు లేకుండా అన్ని స్థాయిలకూ ఒకేరీతిలో ఓటు వేయడం ఇంకా పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నా యి. స్థానిక, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన పనులు, అక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన లేకుండా ఒక సంబరంలా, కోలాహలంగా ఓటు వేయడం, ఎన్నికలయిన దగ్గర్నుంచి నిరంతర నిరసనలు అనే స్థాయికి ఇప్పటికే మన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాం.

ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో తాము వేస్తున్న ఓటుకు,తద్వారా తమ జీవితాల్లో ఆశించదగిన మార్పులకు మధ్య సంబంధంపై ఓటర్లలో అవగాహన కల్పించాలి. ఏ సంస్కరణ అయినా ఓటర్ల ఆలోచనను, పరిణితిని ఇంకా పెంచాలి. పరిపాలనను, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే  బలమైన ఆయుధంగా ఓటును మలచాలి.

ఇప్పటికే ‘ఓటుకు నోటు’తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రస్తుత పరిస్థితు ల్లో జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్యా న్ని అభాసుపాలు చేసి, మొక్కుబడిగా మార్చి, జవాబుదారీతనాన్ని మరింత నామమాత్రం చేసే ప్రమాదం ఉంది. జమి లి ఎన్నికలు దుబారాను  అరికట్టినట్టే, ప్రజాస్వామ్యం బతకాలంటే ఈవీఎంలను పక్కకు పెట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్లాలి. ఏడాదికాలం క్రితం అధికారం చేపట్టిన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరపాలంటే నాలుగు చట్ట రాజ్యాంగ సవరణలు అవసరం.

లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాంమేఘ్వాల్ గుండెకాయ లాంటి జమిలి బిల్లు ఆమోదం కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. ఇది ఆమోదం పొందితే  లోక్‌సభ, రాష్ట్ర  అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ గనుక మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్  చెప్పినట్టుగానే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం గా జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అత్యంత ప్రధానమైన బిల్లుకు మద్దతుగా 269మంది, వ్యతిరేకంగా 198 మంది సభ్యులు పాల్గొని మూడింట రెండువంతు ల ఆధిక్యం రాకుండా బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లారు. జమిలి బిల్లుకు 32 పార్టీలు అనుకూలంగా 15పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. విపక్షాల వాదనలో కొంత నిజం లేకపోలేదు.

మెజార్టీ లేని ప్రభుత్వం కేంద్రంలో పడిపోతే, రాష్ట్రాలు త్యాగాలు చేయడం అనేది ఎట్లా సబబో ఆలోచించా లి. మెజార్టీ లేక బిల్లులు మురిగిపోకుండా ఉండేందుకు జేపీసీలో విస్తృత చర్చ చేయాలని పట్టుపడితే ప్రధాని మోదీ వెంటనే జేపీసీకి ఒప్పుకున్నారు. అయితే బీజేపీ విశ్వాసం అంతాకూడా జేపీసీలో 31మంది సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తమ పార్టీ వారే ఉంటారనే నమ్మకంతో పాటు, 90 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిన షరతుఉండడం. బిల్లు ఆమోదం పొందడానికి  మూడింట రెండు వంతుల మెజార్టీ కోసం లోక్‌సభలో 362 మంది సభ్యులు కావాలి.

అటువంటిది విప్ జారీచేసినా బీజేపీ పార్లమెంట్ సభ్యుల్లో 20 మంది గైర్హాజరు కావడంతో ఆ పార్టీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ప్రతి సార్వత్రిక ఎన్నికకు 10 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందని, జమిలి ఎన్నికల వల్ల 40 శాతం ఆదా అవుతుందనే బీజేపీ వాదనలో నిజంలేదని, కేవలం ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనే సంకల్పంతోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు శ్రీకారం చుట్టారని జమిలి ఎన్నికలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.

19వ లోక్‌సభ కాలపరిమితి ముగియడానికి ముందే  నయాన్నో, భయాన్నో జమిలి అమలు చేయాలనే సంకల్పంతో మోదీ సర్కార్  అనేక సవాళ్ల ముళ్ల ఏరివేతకు దిగింది. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్సీపీ, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు సైతం బిల్లుకు పోటీపడి మద్దతు ఇవ్వడం గమనార్హం. అయితే 100 కోట్ల ఓటర్లు ఉన్న ప్రజాస్వామ్య దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జమిలి సాధ్యమవుతుందో వేచిచూడాలి. 

  1. వ్యాసకర్త సెల్: 9866255355