- అన్వేషణ, అభివృద్ధిపై త్రైపాక్షిక ఒప్పందం
- సింగరేణి, ఓఎన్జీసీ, రెడ్కోల మధ్య ఒప్పందం
- దేశంలోనే అతిపెద్ద జియో థర్మల్ స్టేషన్
- 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్తు
- 20 కిలోవాట్ల పైలట్ ప్రాజెక్టు విజయవంతం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): భూగర్భంలో విస్తారంగా ఉన్న భూతాప (జియో థర్మల్) క్షేత్రం అన్వేషణ, అభివృద్ధిపై సింగరేణి, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ), తెలంగాణ రెడ్కో మధ్య కీలక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. మణుగూరుకు సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారమైన జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సింగరేణి భవన్‌లో ఒప్పంద కార్య క్రమం జరిగింది. ఒప్పందంపై సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, ఓఎన్జీసీ డైరెక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) సుష్మా రావత్, రెడ్కో జీఎం సత్యవరప్రసాద్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ.. మణుగూరులో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించిందని తెలిపారు. సుష్మారావత్ మాట్లాడుతూ దేశం లోనే అతిపెద్ద జియో థర్మల్ క్షేత్రంగా మణుగూరు మారుతుందని అన్నారు. అక్కడ జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి పూర్తి అనువైన వాతావరణం ఉందని, మరింత అన్వే షణ జరిగితే జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తితోపాటు హీలియం వెలికితీసేందుకు అవకా శాలున్నాయని తెలిపారు. ఇప్పటికే సింగరేణి, తెలంగాణ రెడ్కో సహకారంతో క్షేత్ర స్థాయి సర్వేలు చేసినట్టు చెప్పారు. తెలంగాణ రెడ్కో జీఎం సత్యవరప్రసాద్ మాట్లా డుతూ.. మణుగూరులో చేపట్టిన ఈ ప్రాజె క్టు విజయవంతమైతే దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు.
భూమి నుంచే కరెంటు
మణుగూరులో ఇప్పటికే సింగరేణి ఆధ్వర్యంలో భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడినీటితో విద్యుత్తు ఉత్పాదన కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో 20 కిలోవాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ ప్రాంతంలో జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అకాశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో ప్రధానంగా 10 భూతాప ప్రాంతాల్లో 381 భూతాప ప్రదేశాలను గుర్తించారు. వీటిలో మణుగూరు కేంద్రం అత్యంత ఆశాజనకమైన, తగినంత భూతాప సామర్థ్యం కలిగిన ప్రాంతంగా ప్రాథమికంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. మణుగూరులో భూమి లోపల భూతాప కేంద్ర విస్తరణ సహజ సిద్ధంగా ఉందని, కనుక విద్యుత్తు ఉత్పత్తికి ఎక్కువ అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర పరిశోధనల్లో మణుగూరు ప్రాంతంలో 3500 మెగావాట్ల వరకు జియో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని నివేదికలు వచ్చాయని తెలిపారు. మణుగూరు, పగిడేరు ప్రాంతంలో మంచి రవాణా సౌకర్యాలున్నాయని, ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో భూతాప విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ సాధ్యమని అభిప్రాయపడ్డారు.
పైగా సమీపంలో భద్రాద్రి థర్మల్ ప్లాంటు ఉండటంతో గ్రిడ్ అనుసంధానం కూడా చాలా సులువని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయ ణరావు, ఎన్‌వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్‌రెడ్డి, జీఎంలు ఎస్‌డీఎం సుభానీ, దేవేందర్, ఓఎన్జీసీ జీజీఎం గోపాల్‌జోషి, జీఎం సంజయ్ కుమార్ ముఖర్జీ, చీఫ్ మేనేజర్ రమేష్ సాట్ల, అనూప్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి..!
సింగరేణి సీఎండీ బలరామ్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): దక్షిణ భారత థర్మల్ విద్యుత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని తగినంత బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా ప్రతిరోజు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 21.65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 20.94 మిలియన్ టన్నులు మాత్రమే సాధించామని తెలిపారు.
జూలైలో కురిసిన వర్షాలతో ఉత్పత్తికి ఆటంకం కలిగిందని చెప్పారు. రానున్న ప్రతిరోజూ విలువైనదని, ఈ యేడాది 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇకపై రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో రక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని స్పష్టం చేశారు. భూగర్భ, ఉపరితల గనుల్లో పని ప్రదేశాల్లో అధికారులు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అలాగే ఉద్యోగులు కూడా రక్షణ సూత్రాలను పాటించాలని, స్వీయ రక్షణ మరవొద్దని సీఎండీ సూచించారు. ఇందులో సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.