calender_icon.png 19 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో మనూ

28-07-2024 03:18:24 AM

  1. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
  2. లక్ష్యసేన్, సాత్విక్ జోడీ శుభారంభం 
  3. ఆర్చరీ, షూటింగ్‌లో నేడు మెడల్ రౌండ్స్

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో గురి అదిరింది. భారత షూటర్లు విఫలమైన చోట హర్యానా చిన్నది మనూ బాకర్ ఫైనల్లో అడుగుపెట్టి పతకంపై ఆశలు రేపుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగిన మనూ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన కొనసాగించి పట్టుదలతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తుది పోరుకు అర్హత సాధించింది. నేడు జరగనున్న మెడల్ రౌండ్‌లో మనూ పతకం గెలవాలని ఆశిద్దాం. రోయింగ్‌లో బల్‌రాజ్ పన్వార్ రెపిచేజ్ రౌండ్‌కు అర్హత సాధించగా.. బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ తో పాటు డబుల్స్‌లో సాత్విక్ జోడీ శుభారంభం చేసింది. 

పారిస్: ఒలింపిక్ క్రీడల్లో భాగంగా తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. షూటింగ్‌లో పతకాలు తెస్తారని ఆశించిన మన షూటర్లు నిరాశ పరిచారు. మను బాకర్ మినహా 10 మీటర్ల పిస్టల్ విభాగంలో మిగతా షూటర్లు క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగారు. రోయింగ్‌లో బల్‌రాజ్ పన్వర్ స్కల్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి రెపీచేజ్ రౌండ్‌కు అర్హత సాధించి పతకం రేసులో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో  సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేయగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ బోణీ కొట్టాడు. ఇక నేడు షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో మెడల్ రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మనూ మినహా..

మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 22 ఏళ్ల మను భాకర్ 3వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న మను భాకర్ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లడం ఇదే తొలిసారి. హంగేరీకి చెందిన వెరోనికా 582 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. మరో షూటర్ రిథమ్ సంగ్వాన్ 573 పాయింట్లు స్కోరు చేసి 15వ స్థానంలో నిలిచింది.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్ జోత్, అర్జున్ సింగ్‌లు నిరాశ పరిచారు. సరబ్ జోత్ 9వ స్థానంలో నిలిచి తృటిలో మెడల్ రౌండ్ అవకాశం చేజార్చుకోగా.. అర్జున్ 18వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 10 మీటర్ల మిక్స్‌డ్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్ బబౌటా, సందీప్ సింగ్ జోడీ మెడల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.  టాప్ నిలిచిన షూటర్లు మెడల్ రౌండ్‌కు అర్హత సాధించడం జరుగుతుంది.

రెపిచేజ్ రౌండ్‌లో పన్వర్..

రోయింగ్ క్రీడలో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక ఆటగాడు బల్‌రాజ్ పన్వర్ పతకం రేసులో నిలిచాడు. పురుషుల సింగిల్స్ స్కల్ కాంపిటీషన్ హీట్‌ౠ పోటీల్లో పన్వర్ గమ్యాన్ని (7:07.11 సెకన్లు) పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచి రెపీచేజ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. రెపిచేజ్‌లో పన్వర్ విజయం సాధిస్తే సెమీస్ లేదా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశముంటుంది. ఇక స్కల్ పోటీల్లో ప్రతీ హీట్‌లో టాప్ నిలిచిన ఆటగాళ్లు క్వార్టర్స్‌కు చేరుకోనున్నారు. 

సాత్విక్ జోడీ అదుర్స్

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్‌ెేచిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జంట 21 21 ఫ్రాన్స్‌కు చెందిన కోర్వీ, లాబర్‌పై విజయాన్ని అందుకుంది. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సాత్విక్ జంట ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. గ్రూప్ తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21 22 కెవిన్ కోర్డాన్ (గౌటెమలా)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ కేవలం రెండు గేముల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లో లక్ష్యసేన్ బెల్జియంకు చెందిన జులియెన్ కర్రాగితో తలపడనున్నాడు.

    నేడు ఒలింపిక్స్‌లో భారతీయం

    బ్యాడ్మింటన్: 

    మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): పీవీ సింధు x అబ్దుల్ రజాక్ (మాల్దీవులు)  

    పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్):  ప్రణయ్ x ఫాబిన్ రోత్ (జర్మనీ)

    షూటింగ్: 

    మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ 

    అర్హత పోటీ: వలరివన్

    పురుషుల 10 మీటర్ల ఎయిర్ 

    రైఫిల్ అర్హత పోటీ: 

    సందీప్ సింగ్, అర్జున్ బబౌత

    మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్: 

    మనూ బాకర్ (ఫైనల్) 

    రోయింగ్: 

    పురుషుల సింగిల్స్ స్కల్స్ (రెపీచేజ్ 2): బాలరాజ్ పన్వర్

    టేబుల్ టెన్నిస్: 

    మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): 

    శ్రీజ ఆకుల x క్రిస్టినా కల్‌బర్గ్ (స్వీడన్)

    మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా x అన్నా హుర్సే 

    (గ్రేట్ బ్రిటన్)

    పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): 

    శరత్ కమల్ x డెనీ కోజుల్ (స్లోవేనియా) 

    స్విమ్మింగ్: 

    పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ (హీట్ 2): శ్రీహరి నటరాజ్

    మహిళల 200 మీటర్ల ఫ్రీ స్టుల్ (హీట్ 1): ధినిది 

    ఆర్చరీ: 

    మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్ : 

    భారత్ (అంకితా, భజన్ కౌర్, 

    దీపికా కుమారి) x ఫ్రాన్స్/నెదర్లాండ్స్