పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మహిళా షూటర్ మనూ బాకర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించిన మను మంగళవారం ఇదే విభాగం మిక్స్‌డ్ టీమ్ పోటీలో సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా స్వాతంత్య్రానంతరం ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్రలో నిలిచింది. భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు సాధించాడు. బ్రిటీష్-- ఇండియన్ అథ్లెట్ అయిన అతను ఆ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారత అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించలేదు.
అయితే, తమ కెరీర్‌లో ఒలింపిక్స్‌లో రెండు పతకాల సాధించిన భారత అథ్లెట్లు మరో ఇద్దరు ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్‌కుమార్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అలాగే, మన తెలుగుతేజం పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో రజతం, ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 37 పతకాలు సాధించినా వాటిలో ఎక్కువ భాగం హాకీలో వచ్చినవే. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించడంతో భారతీయులు వ్యక్తిగత పతకాలు సాధించడం మొదలైందని చెప్పాలి. తర్వాత కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్‌లో మరో కాంస్య పతకం సాధించింది.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అభినవ్ బింద్రా అథ్లెట్స్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రాణించి మొత్తం 7 పతకాలను దక్కించుకుంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో చరిత్ర సృష్టించి స్వర్ణ పతకాన్ని సాధించడంతో అతని పేరు మార్మోగిపోయింది. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నీరజ్ చోప్రాపై మన దేశం కోటి ఆశలు పెట్టుకుంది. పీవీ సింధు, నిఖత్ జరీన్, శ్రీజ, లవ్లీనా బోర్గోహైన్, మీరాబాయి చాను, చిరాగ్ శెట్లి- సాత్విక్ జోడీ, పురుషుల హాకీ టీమ్.. అందరూ భారత్‌కు పతకాలు సాధించి పెట్టగల సమర్థులే.
మనూ బాకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా సరబ్ జ్యోత్‌కు మొదటి ఒలింపిక్స్. ఇద్దరూ హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువ అథ్లెట్లే. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మనూ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్వాలిఫికేషన్ మధ్యలో పిస్టల్ మరమ్మతులకు గురవడంతో ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ, పారిస్‌లో మాత్రం సత్తా చాటి తనేమిటో నిరూపించుకుంది. ఇక, సరబ్ జ్యోత్ సింగ్ పట్టువదలని విక్రమార్కుడేనని చెప్పాలి. మూడు రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో వెంట్రుక వాసిలో ఫైనల్ బెర్త్ కోల్పోయిన సరబ్ జ్యోత్ ఏ మాత్రం నిరాశ చెందకుండా మిక్స్‌డ్ విభాగంపై దృష్టిపెట్టి అనుకున్నది సాధించాడు.
గగన్ నారంగ్, విజయ్‌కుమార్ తర్వాత ఈ విభాగంలో పతకం గెలిచిన మూడో భారత షూటర్‌గా నిలిచాడు. రైతు కుటుంబంలో జన్మించిన సరబ్ జ్యోత్ మొదట్లో ఫుట్ బాలర్ కావాలని అనుకున్నాడు. అయితే, 13 ఏళ్ల వయసులో ఒకసారి సమ్మర్ క్యాంప్‌లో పిల్లలు పేపర్ టార్గెట్లను గురిచూసి కొట్టడం చూసి షూటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. 2019లో జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెలుపొందడం ద్వారా సీనియర్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది దోహా లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం సాధించాడు. 2023 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్‌లో చోటు ఖాయం చేసుకున్నాడు. పాతికేళ్లయినా నిండని ఈ యువ షూటర్లు రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తారని యావద్దేశం ఆశిస్తున్నది.