01-04-2025 01:06:47 AM
కాకర్లపల్లి గ్రామ దళితులకు దక్కని భూమి..
మంథని మార్చి 31 (విజయ క్రాంతి) మంథని మండలం రెడ్డి చెరువు శిఖం భూమి పూర్తిగా కబ్జాకు గు గురయిందని, సోమవారం మండలంలోని కాకర్లపల్లి గ్రామ దళితులు ఈ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ రెడ్డి చెరువు శిఖం భూమి కి ఆనుకొని ఉన్న కొంతమంది రైతులు శిఖం భూమి మీద కన్ను వేసి అర్ధరాత్రి దొంగ చాటున ట్రాక్టర్లతో సాగు చేసి దాదాపు చెరువు శిఖం భూమిని మొత్తం కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం కాకర్లపల్లి గ్రామ దళితులకు కొంత ప్రభుత్వ భూమిని దళితులకు ఇచ్చినట్టు రెవెన్యూ రికార్డులో ఉన్నదని పట్టాలు ఇవ్వాలని అనేకమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
సంబంధిత రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కబ్జాకు గురైన రెడ్డి చెరువు శిఖం భూమిని పరిశీలించి కబ్జా గురైన భూమినీ స్వాధీనం చేసుకొని హద్దులు వెయ్యాలని ఆక్రమించిన కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రెవెన్యూ రికార్డులో ఉన్న విధంగా కాకర్లపల్లి గ్రామ దళితులకు భూములు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రెడ్డి చెరువు సంరక్షణ కోసం గ్రామస్తులను అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మంథని రామ్ చందర్, బోసెల్లి శంకర్, బూడిద బానయ్య, బోసెల్లి సది, మంథని సమ్మయ్య, మంథని సాగర్, బూడిద రవీందర్, రాంగళ్ళ శ్రీకాంత్ ఉన్నారు.