calender_icon.png 23 March, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతిభ్రమించిన నీ మాటలు మంథనిలో ఎవరు నమ్మరు పుట్ట..

22-03-2025 04:52:26 PM

మంథనికి మంత్రి శ్రీధర్ బాబుతోనే మహర్దశ..

ముత్తారం (విజయక్రాంతి): మతిభ్రమించిన నీ మాటలు మంథనిలో ఎవరు నమ్మరు పుట్ట మధు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. శనివారం ముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీతో కలిసి ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న దృడ సంకల్పంతో ముందుచూపుతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి చర్యలు చేతల్లో చేసి చూపిస్తున్నారని కానీ కొందరు మతిభ్రమించిన అవివేకమైన నిరక్షరాస్యులు వారి ఉనికి కోసం మంథని ప్రజలకు మాయమాటలతో మంథనికి ఎలాంటి అభివృద్ధి నిధులు రావట్లేదని మంత్రి శ్రీధర్ బాబుపై దుష్ప్రచారాలు చేయడమే విధిగా పెట్టుకున్నారని అవేదన వ్యక్తం చేశారు.

వారి మాటలు మంథనిలో పట్టించుకునే వారు ఎవరు లేరన్నారు. గత ప్రభుత్వంలో వారు అధికార దర్పంతో కమిషన్ల కాసులకు కక్కుర్తిపడి మేడలు కట్టుకోవడం అభివృద్ధి కాదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో కమిషన్ ను నొక్కిన ఘనత, ఇసుక లారీలతో ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకొని వారి శవాలపై సైతం పేలాలు ఏరుకున్నట్లుగా వారి ప్రాణాలకు వెలగట్టి అందులో సైతం కాసులకు కక్కుర్తి పడి రక్తపు కూడు తిన్న నీచ చరిత్ర మంథని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదన్నారు. 

మంథని ప్రజల అభివృద్దే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ మంథనికి కేటాయించిన నిధుల గురించి చెబుతా వినుకో.. మతి భ్రమించిన మధుకర్ చిన్న కాలేశ్వరానికి రూ. 2000 కోట్లకు పైగా, మంథని పట్టణం రింగురోడ్డుకు రూ. 130 కోట్లు, మంథని గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి రూ. 120 కోట్లు, కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ. 115 కోట్లు, మంథని గంగాపురి నుండి ఓడేడు వరకు రూ. 60 కోట్లతో డబుల్ రోడ్డు, పక్కన రూ. 50 కోట్లతో మంథనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, ఓడేడు బ్రిడ్జికి రూ. 41 కోట్లు, ఖమ్మంపల్లి నుండి ఓడేడు వరకు రూ. 30 కోట్లు, రూ. 5 కోట్లతో మాస్టర్ ప్లాన్ తో రామగిరికి పర్యాటక సిరి, ఎల్ మడుగు ఎకో పార్క్ అభివృద్ధికి రూ. 2 కోట్లు, గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ తీరానికి రూ. 2 కోట్లు, ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే మంథనికే మంజూరైన సీసీ రోడ్లు అంతర్గత రోడ్లకు మంజూరైన నిధుల వరదల లెక్క చెప్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్  మధుకర్ అన్నారు. 

ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిధులను అహర్నిశలు మంథని ప్రజల కోసం తీసుకువచ్చే శ్రీధర్ బాబుపై పిచ్చి మాటలు మాట్లాడితే మతిభ్రమించిన నిన్ను మంథని ప్రజలు మరో మారు ఓటుతో తప్పక బుద్ధి చెప్పి,మంథని నుండి ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. వీటన్నింటినీ మంత్రి శ్రీధర్ బాబు తీసుకువచ్చిన నిధులు అంటారా... మరి ఏమంటారు మధుకర్. ఇన్ని రోజులుగా నీకు మతి మాత్రమే భ్రమించి మందబుద్ధి గల మధు వని మంథని ప్రజలు అనుకున్నారని, కానీ ఇన్ని నిధులు కేటాయించిన మీకు కనబడకపోవడంతో ఇప్పటినుండి నీకు కళ్ళు కనిపించని కబోదివని కూడా అర్థమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బక్కతట్ల వినిత్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరి రావు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడవేన సంపత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అల్లం కుమార్ స్వామి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా, మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బియ్యని శివకుమార్, తాజా మాజీ ముత్తారం గ్రామ సర్పంచ్ తూటి రజిత రఫీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.