అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది భారతీయ మూలాలున్న వారిని కీలక పదవుల్లో నియమించుకున్న ట్రంప్ తాజాగా మరో భారత అమెరికన్ పారిశ్రామికవేత్తకు తన టీమ్‌లో చోటు కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌పై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్ క్యాపిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఓ సాక్స్‌తో కలిసి ఆయన పని చేస్తారని తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన కృష్ణన్ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఫేస్‌బుక్, యాహూ, ట్విట్టర్, స్నాప్ వంటి సంస్థల్లో పని చేశారు. 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు కృష్ణన్ అక్కడే పని చేశారు.
ఆ సమయంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్‌ను నియమిస్తారన్నవార్తలు కూడా వచ్చాయి. వచ్చేనెల 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన టీమ్‌ను ఎంపిక చేసుకునే కసరత్తును ఎన్నికల్లో విజయం సాధించిన రోజునుంచే మొదలు పెట్టారు. అయితే విశేషం ఏమిటంటే అమెరికా జనాభాలో కేవలం రెండు శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వారికి తన టీమ్‌లో ఆయన పెద్ద పీట వేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించిన ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తానన్న సందేశాన్ని పరోక్షంగా ఇచ్చినట్లయింది.
ట్రంప్ తన టీమ్‌లోకి ఎంపిక చేసుకున్న భారతీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన వ్యక్తి వివేక్ రామస్వామి. అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో ఒక దశలో పోటీ పడ్డ వివేక్ రామస్వామి ఆ తర్వాత పోటీనుంచి తప్పుకుని ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ట్రంప్‌కు అనేక అంశాల్లో కీలక సలహాలు ఇవ్వడం కోసం ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోగ్)లో మస్క్‌తో కలిసి రామస్వామి పని చేస్తారు.
ఈ జాబితాలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమితురాలైన హర్మీత్ ధిల్లాన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమితుడైన డాక్టర్ జయ్ భట్టాచార్య, అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితుడైన కశ్యప్ కష్, నేషనల్ ఇంటెలిజన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ ప్రధానంగా ఉన్నారు. వీరంతా భారత్‌లోని వివిధ రాష్ట్రాలనుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడి వారే కావడం గమనార్హం. ఇక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి మన తెలుగు మహిళ కావడం గర్వకారణం.
సాధారణంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే భారతీయ అమెరికన్లకు ట్రంప్ తన టీమ్‌లో పెద్ద పీట వేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఎంపిక చేసున్న భారతీయ సంతతి వాళ్లంతా కూడా కష్టకాలంలో ఆయనకు మద్దతుగా నిలిచిన వారే. ఎనిమిదేళ్ల క్రితం హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేసిన మెజారిటీ భారతీయులు ఈ సారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటు వేస్తారని అందరూ అనుకున్నారు.
గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 69 శాతం భారతీయులు ఆమెకే ఓటు వేశారని ఓ సర్వే అంచనా వేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ తన ప్రభుత్వంలో భారతీయులకు పెద్దపీట వేయడాన్ని వారంతా సంతోషంగా స్వాగతిస్తుండడం గమనార్హం. దీన్ని బట్టే అమెరికా వాణిజ్యరంగంలో కీలకంగా మారిన భారతీయులు రాజకీయంగా కూడా ఎంతగా ఎదిగారో అర్థమవుతుందని వారంటున్నారు.
భారత ప్రధాని మోదీతో ట్రంప్‌కున్న సాన్నిహిత్యం కూడా ఇందుకు దోహదపడిందని అభిప్రాయపడుతున్నారు. మరి దీని ప్రభావం రాబోయే రోజుల్లో ట్రంప్ విధానాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.