- సింధు, శ్రీజ, నిఖత్ శుభారంభం
- షూటింగ్ ఫైనల్లో రమితా, అర్జున్
పారిస్: ఒలింపిక్స్ రెండోరోజు క్రీడల్లో మనకు అంతా శుభమే జరిగింది. ఒకటి రెండు తప్ప బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్‌లో మన అథ్లెట్లు విజయాలు సాధించి ముందంజ వేశారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు శుభారంభం చేయగా.. టేబుల్ టెన్నిస్‌లో తెలుగు తేజం ఆకుల శ్రీజ, మనికా బాత్రా విజయాలతో ప్రయాణం ఆరంభించగా. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్‌తో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. షూటింగ్‌లో రమిత జిందాల్, అర్జున్ బబౌటాలు ఫైనల్లో అడుగుపెట్టి పతకంపై ఆశలు రేపుతున్నారు
ప్రిక్వార్టర్స్‌లో నిఖత్..
తొలిసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నిఖత్ జరీన్ 5-0తో జర్మనీ బాక్సర్ మ్యాక్సీ కరీనాను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన నిఖత్‌ను జడ్జీలు ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు. ఆగస్టు 1న జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది. మరో బాక్సర్ ప్రీతి పవార్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
సింధు దిగ్విజయంగా..
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, తెలుగుస్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆదివారం మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సింధు 21-9, 21-6తో అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై సునాయాస విజయాన్ని అందుకుంది. 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు బలమైన స్మాష్‌లతో విజృంభించింది. గ్రూప్ స్టేజ్‌లో తదుపరి మ్యాచ్‌లో సింధూ ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కుబాతో తలపడనుంది.
శ్రీజ ఆకుల ముందంజ..
పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న తెలుగు తేజం ఆకుల శ్రీజ ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్‌లో శ్రీజ 4-0తో క్రిస్టినా (స్విట్జర్లాండ్)పై అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది. మరో సింగిల్స్‌లో మనికా బాత్రా కూడా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో మనికా 4-1 తేడాతో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన అన్నా హర్సేపై విజయాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించిన వెటరన్ ఆచంట శరత్ కమల్ పోరాటం ముగిసింది. 41 ఏళ్ల శరత్ కమల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అయితే డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ బరిలో ఉన్నాడు.
ఫైనల్లో రమితా, అర్జున్
పారిస్ క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. మనూ బాకర్ కాంస్యం గెలిచిన కొన్ని గంటల్లోనే పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబౌటా, రమితా జిందాల్‌లు ఫైనల్‌కు దూసుకెళ్లి పతకంపై ఆశలు పెంచారు. పురుషుల విభాగంలో అర్జున్ 630.1 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించగా.. మహిళల విభాగంలో రమితా 631.5 పాయింట్లు స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. మరో షూటర్ సందీప్ సింగ్ 629.3 పాయింట్లతో 12వ స్థానంతో సరిపెట్టుకొని నిరాశపరిచాడు.
క్వార్టర్స్‌లో పన్వర్
ఒలింపిక్ క్రీడల్లో రోయింగ్ విభాగంలో బరిలోకి దిగిన ఏకైక భారత అథ్లెట్ బల్‌రాజ్ పన్వర్ సత్తా చాటుతున్నాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో పన్వర్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పోటీలో బల్‌రాజ్ 7నిమిషాల 12.41 సెకన్లలో గమ్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా.. మొనాకోకు చెందిన క్వింటన్ ఆంటోగ్నెల్లి 7 నిమిషాల 10 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానం దక్కించుకున్నాడు. హీట్స్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోవర్స్ నేరుగా క్వార్టర్స్‌కు చేరితే.. రెపిచేజ్ రౌండ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్స్‌లో అడుగుపెడతారు.
నేడు ఒలింపిక్స్‌లో భారతీయం
ఆర్చరీ:
పురుషుల టీం క్వార్టర్ ఫైనల్స్:
తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ (ఫైనల్)
బ్యాడ్మింటన్:
పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్ చిరాగ్ x మార్క్ లాంఫస్ సీడెల్ (జర్మనీ)
మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): అశ్విని x నమీ షిడా (జపాన్)
పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): లక్ష్య సేన్ x జులియెన్ కర్రాగి (బెల్జియం)
షూటింగ్:
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్డ్స్ టీమ్ క్వాలిఫికేషన్: మనూ బాకర్ సింగ్; రిథమ్ సంగ్వాన్‌అర్జున్ సింగ్
పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్: పృథ్విరాజ్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్: రమిట జిందాల్ (ఫైనల్)
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్: అర్జున్ బబౌట (ఫైనల్)
హాకీ: పురుషుల పూల్ మ్యాచ్: భారత్ x అర్జెంటీనా
టేబుల్ టెన్నిస్:
మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 32): శ్రీజ ఆకుల x జియాన్ జెంగ్
(సింగపూర్)