05-04-2025 12:00:00 AM
బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటు డు, సినీదర్శకుడు మనోజ్‌కుమార్ (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, వ యోభారంతో బాధపడుతున్నారు. ఇందుకోసం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1937, జూలై 24న జన్మించిన మనోజ్‌కుమార్ అసలు పేరు హరికృష్ణగిరి గోస్వామి. దేశభక్తి సినిమాలతో ప్రసిద్ధి చెందారాయన. అందుకే మనోజ్‌కుమార్‌ను భరత్‌కుమార్ అని పిలుస్తారు. ‘షహీద్’ (1965), ‘ఉప్కార్’ (1967), ‘పురబ్ ఔర్ పశ్చిమ్’ (1970), ‘రోటీ కప్దా ఔర్ మకాన్’ (1974) వంటి ఎన్నో ప్రేక్షకాదరణ పొందిన దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించారు. ‘హరియాలీ ఔర్ రాస్తా’, ‘వో కౌన్ థీ’, ‘హిమాలయ్ కి గాడ్ మే’, ‘దో బదన్’, ‘పత్తర్ కే సనమ్’, ‘నీల్ కమల్’, ‘క్రాంతి’ వంటి అనేక గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు.
భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను మనోజ్‌కుమార్‌కు 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. మనోజ్‌కుమార్ మృతిపై సినీతారలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ.. ‘తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో దేశభక్తి చిత్రాలను తెరకెక్కించారు. అవి భారతదేశానికే గర్వకారణంగా నిలిచాయి. ఆయన ప్రాణం పోసిన పాత్రలు ఎప్పటికీ జ్ఞాపకాలుగా మన హృదయాల్లో ఉంటాయి. ఆయన సినిమాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయి’ అని పేర్కొన్నారు. ‘భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ఐకాన్. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన రచనల్లోనూ జాతీయభావం ఉప్పొంగుతుంటుంది. అవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబాలనికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం ప్రకటించారు.