రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి లేదా కిసాన్ ఘాట్‌లో నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ, జనవరి 1: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్ లేదా కిసాన్ ఘాట్ సమీపంలో 1-1.5 ఎకరాల్లో స్మారక చిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
ప్రభుత్వం తన ప్రతిపాదనను మన్మోహన్ కుటుంబ సభ్యులకు పంపించి, ఇందులో ఏదో ఒకస్థలాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది. మన్మోహన్ కుటుంబ సభ్యులు తమ నిర్ణయాన్ని వెలువరించిన అనంతరం ప్రతిపాదిత స్థలంలో స్మారక నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాలను పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే పరిశీలించినట్టు సమాచారం. కాగా నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వం స్మారక చిహ్నం కోసం భూమిని ట్రస్ట్‌కు మాత్రమే కేటాయిస్తుంది. ట్రస్ట్ ఏర్పడిన తర్వాత భూమి కోసం దరఖాస్తు చేసుకుని, నిర్మాణం కోసం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
కాగా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల స్మారకాలు ఉన్న రాజ్‌ఘాట్‌కి సమీపంలోనే మన్మోహన్ స్మారకం చిహ్నం ఉండే అవకాశం ఉంది.