calender_icon.png 3 January, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ సింగ్ మన ఆత్మబంధువు

31-12-2024 02:13:05 AM

భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

  1. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు
  2. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్
  3. తెలంగాణ బిడ్డ పీవీతో కలిసి ఎల్‌పీజీ విధానాల అమలు
  4. సరళీకృత విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు
  5. నేటి తరంలో నీతి, నిజాయితీకి ఆయన రోల్ మోడల్
  6. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
  7. మాజీ ప్రధానికి శాసనసభ ఘననివాళి

* నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉన్నారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు. తెలంగాణతో ఆయన అనుబంధం విడదీయలేనిది. రాష్ట్రం ఉన్నంతవరకు మర్చిపోలేనిది. ఈ రాష్ట్రానికి పురుడుపోసిన డాక్టర్‌గా మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది.

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యతను తీసుకున్న గొప్ప నాయకుడు. మన్మోహన్ సింగ్ దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ నివాళులర్పిస్తోంది.

- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవ ర్నర్ అయిన మన్మోహన్ సింగ్.. తెలంగాణకు మాత్రం ఆత్మబంధువు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రధాని హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది అని వివరించారు.

తెలంగాణ ఏర్పాటువల్ల రాష్ట్ర ప్రజలు సోనియాగాంధీకి ఎంత రుణపడి ఉంటారో, ఉభయసభల్లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ను ఆమోదింపజేయడంలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్‌కు కూడా అంతే రుణపడి ఉంటారని చెప్పారు. మన్మోహన్ సింగ్‌తో దివంగత జైపాల్‌రెడ్డికి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేశారు.

జైపాల్‌రెడ్డి సూచనలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళుల ర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతిపై సం తాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవం గా ఆమోదించింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటన్నారు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని ఎన్న డూ కోల్పోలేదన్నారు. దేశ ప్రజల కోసమే పనిచేశారన్నారు. దేశాన్ని ఆర్థికంగా, సామాజి కంగా, సాంకేతికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు చెప్పారు. 

తెలంగాణ బిడ్డ పీవీతో కలిసి..

తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుతో కలి సి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ యవనికపై మన్మోహన్ సింగ్ సుస్థి రం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ వేసిన పునాదులు ప్రపంచ దేశాలతో పోటీ పడటానికి కారణమయ్యాయ న్నారు.

ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ- దిశను మార్చాయని గుర్తు చేశారు. నేడు ప్రపంచ దేశాలకు మేధోసంపత్తిని ఎగుమతి చేస్తున్నామంటే.. నాడు పీవీజ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సరళీకృత విధానాలనే అన్నారు. ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ తరంలో నీతి, నిజాయితీకి రోల్ మోడల్‌గా ఆయన నిలిచారన్నారు. 

పదేళ్ల పాలనలో చట్టాల్లో సమూల మార్పులు

2004 మధ్య ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. తన పదేళ్లలో ప్రజలకు ఉపయోగపడేలా, పారదర్శకమైన పాలన అందించేలా చట్టంలో సమూల మార్పులు చేసినట్లు చెప్పారు. ఉపా ధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన మహోన్నత వ్యక్తి అన్నారు.

పరిపాలనలో పారదర్శకతను చాటిచెప్పే సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ఆయనే ప్రారంభించారన్నారు. ఇప్పుడు అన్నింటికీ ఆధారమైన ఆధార్‌ను తీసుకొచ్చింది కూడా  ఆయనేనని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి కోల్పోతున్న వారితో పాటు భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేసినట్లు పేర్కొన్నారు.

2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన గిరిజనులకు ప్రయోజనం జరిగేలా చేశారన్నారు. ఈ చట్టం వల్లే నేడు పోడు భూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నామన్నారు. అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. 

తెలంగాణ అంటే అభిమానం

మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అంటే అమితమైన అభిమానమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని మన్మోహన్  సతీమణి తనకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని మన్మోహన్  సతీమణి అన్నారన్నారు.

ఆ రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకోవాలని, ఆయన అశీస్సులు ఉంటాయని ఆమె తెలిపారన్నారు. మన్మోహన్ సింగ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటార ని మన్మోహన్ అంత్యక్రియల సందర్భం గా తను గమనించానని ముఖ్యమంత్రి చెప్పారు.

అది మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన

ఈ తరం ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక రం గంలో ఆయన దేశానికి మార్గదర్శి అని, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయుడన్నా రు. ఆధునిక భారత్‌ను ప్రపంచస్థాయిలో మేటి దేశంగా చేయడంలో ఆయన చూపి న దార్శనికతను అందరూ గర్తుంచుకోవాలని, భావి తరాలు స్మరించుకోవాలన్నా రు.

ఈ సందర్భంగా మన్మోహన్ నిరాడంబరత గురించి తన ప్రత్యేక్ష అనుభవాన్ని సీఎం వివరించారు. ప్రభుత్వాలు ఆధిపత్యాన్ని చలాయించడాన్ని వ్యతిరేకిస్తూ..  తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు  ఢిల్లీ లో నిరసన తెలుపుతుంటే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమతో పాటు మన్మోహ న్ సింగ్ ఆందోళనలో పాల్గొన్న విషయా న్ని ఈసందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశా రు.

పదేళ్లు ప్రధానిగా చేసిన అంతటి వ్యక్తి తమతో కలిసి నిరసనలో పాల్గొన్న ఘటన జీవితకాలం గుర్తుండిపోయే సం ఘటన అని చెప్పారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే తమతో నిరసనలో పాల్గొనడం ఆయన నిరాడంబరతకు నిదర్శనమన్నారు.