- ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ
- సామజిక ఉద్యమకారుడు అన్నాహజారే
ముంబై/రాలేగావ్‌సిద్ధి, డిసెంబర్ 27: తన పాలనా కాలంలో ఎప్పుడు సామాజిక సంక్షేమం, దేశాభ్యున్నతికే మన్మోహన్ సింగ్ ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై ఆయన సంతాపం తెలిపారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని కొనియాడారు.
పుట్టినవారు మరణిస్తారని, కానీ వారి జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. తాను 2010లో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టనపుడు తనను ఆయన చర్చలకు ఆహ్వానించారని, వేగంగా నిర్ణయాలు తీసుకునేవారని పేర్కొన్నారు. అవినీతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని తెలిపారు.
లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలకు సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఎల్లప్పుడు దేశం, ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే ఆలోచించేవారని తెలిపారు. మన్మోహన్ సింగ్ మన నుంచి భౌతికంగా దూరమైనా, ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అన్నారు.