- సింపుల్ లివింగ్, హై థింకింగ్‌కు పర్యాయపదం
- ఢిల్లీలో పీవీకీ స్మారకం ఏర్పాటు చేయాలి
- అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాజకీయాల్లో లాయల్టీ అనేది చాలా అరుదని, అలాంటి లాయల్టీకి నిలువుటద్దం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్‌కు ఆయన పర్యాయ పదమని చెప్పారు. సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారని పేర్కొన్నారు.
సంస్కరణల విషయంలో ఎన్ని నిందలు ఎదురైనా ఆయన సరళీకరణ విధానాలను వీడలేదని గుర్తుచేశారు. సోమవారం అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. మన్మో హన్ కుటుంబల సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దుతు ఇస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్‌ను ఆర్థిక మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సంస్కరణలు దేశ స్థితిగతులను మార్చాయని పేర్కొన్నారు.
విగ్రహ ఏర్పాటుకు మద్దతు
హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్ర హం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు తామూ సహకరిస్తామని కేటీఆర్ తెలిపా రు. అలాగే, మన్మోహన్‌ను రాజకీయాల్లో తీసుకొచ్చిన పీవీ నరసింహారావుకు కూడా ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని, ఈ అంశం పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కేసీఆర్‌తో మంచి అనుబంధం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మన్మోహన్‌సింగ్‌కు మంచి అనుబంధం ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక చిక్కుముడి వచ్చిందని నాటి సంఘటనను కేటీఆర్ ప్రస్తావించారు. అప్పుడు కేసీఆర్ వద్ద షిప్పింగ్ పోర్టుపోలిమో ఉండేదని.. షిప్పింగ్ పోర్టుపోలియోను డీఎంకే అడగటంతో కేసీఆర్ వెనక్కి ఇచ్చారని చెప్పారు. ఈ త్యాగం కేసీఆర్‌ను కర్మయోగిగా మారుస్తుందని నాడు మన్మోహన్ సింగ్ చెప్పినట్లు పేర్కొన్నారు.
స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి
- ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటుకు తీర్మానం చేయాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మన మధ్య లేకపోయినా ఆయన సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టడంతోపాటు భారత రత్న ఇవ్వాలని సూచించారు. ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటుకూ అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినసంతాప తీర్మానాన్ని బలపరిచి మాట్లాడారు. ఆర్థికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణమన్నారు. మన్మోహన్‌కు విదేశాల్లో గొప్ప అవకాశాలొచ్చినా తిరస్కరించి, మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పదవుల కోసం ఆయన పాకులాడలేదని.. పదవు లే ఆయన వద్దకు వచ్చాయని గుర్తు చేశారు.
ఆయనను దేశ రాజకీయాలకు పరిచయం చేసింది తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావేనని గుర్తుచేశారు. పీవీ తన మంత్రివర్గంలో మన్మోహన్‌సింగ్‌కు ఆర్థికశాఖ మంత్రిగా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థికరంగానికి తనదైన శైలిలో దశ దిశను చూపిన వ్యక్తి మన్మోహన్ అని పేర్కొన్నారు. యూపీఏ -2లో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగినట్టు వార్తలు వచ్చినా, మన్మోహన్ సింగ్‌పై మచ్చకూడా పడలేదంటే అందుకు ఆయన గొప్పతనమే కార ణమన్నారు.
దేశాన్ని దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కించిన పీవీకి మన్మోహన్ ఒక చోదకశక్తిగా పనిచేశారన్నారు. మన్మోహన్ విగ్రహ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. పీవీ మరణించిన రోజును పట్టించుకోలేదని.. పీవీ ఘాట్‌ను కేసీఆర్ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను జరిపి.. మన పీవీ, మన ఠీవి అని వారి ఖ్యాతిని చాటారని వివరించారు.
కాంగ్రెస్ ఓటమికి మన్మోహన్, పీవీ ఆర్థిక విధానాలే కారణమని ఏఐసీసీ ఆంటొనీ కమిటీ రిపోర్టు ఇచ్చి ఏఐసీసీలో చర్చపెడితే.. మన్మోహన్ కంటతడి పెట్టారే తప్పా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని గుర్తు చేశారు.