రతన్ టాటా అంటే సగటు భారతీయుడికి ఎంతో ఇష్టం. విజయవంతమైన వ్యాపారవేత్తగానో, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగానో కాదు..ఓ మనసున్న మానవతామూర్తిగా ఆయనను కోట్లాది మంది అభిమానిస్తారు. సోషల్ మీడియాలో ఆయనకుపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన చేసే ప్రతిపనిలోనూ సామాజిక బాధ్యత కనిపిస్తుంది. నానో కారు ఆవిష్కరణ, తాజ్ హోటల్, సోషల్ మీడియా, ఉద్యోగుల పట్ల బాధ్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంటుంది.
ముఖ్యంగా సమాజాన్ని సరైన దిశలో నడిపించడానికి ఆయన చివరి రోజుల వరకు చేతనయినంత కృషి చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్టు నానో కారు ఆవిష్కరణ వెనుక ఆయన సేవా దృక్పథం దాగి ఉంది. ఓ సారి ఆయన తన ‘ఇన్‌స్టా’ పోస్టులో ఈ విషయాన్ని పంచుకున్నారు. చాలా కుటుంబాలు తరచూ తమ పిల్లలతో స్కూటర్లపై వెళ్లడాన్ని చూసే వాడినని, తల్లీ తండ్రి మధ్య కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమోననిపించేదని పేర్కొన్నారు.
అదే సామాన్యుడి కారు నానో రూపకల్పనకు దారి తీసిందన్నారు. ‘నానో ఎప్పటికీ మన ప్రజల కోసమే’ అంటూ ఆ కారు ఆవిష్కరణ వెనుక తన ఆలోచనను రతన్ టాటా బయటపెట్టారు. నాలుగైదేళ్లు ఆలస్యమయినా, ఖర్చు పెరిగిపోయినా తాను అనుకున్న నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రతన్ టాటా.
అలాగే వీవీఐపీలు, సెలబ్రిటీలు నిత్యం వచ్చే తాజ్ హోటల్ ప్రవేశద్వారం వద్ద ఓ వీధి శునకం నిద్రిస్తూ ఉన్న చిత్రం మీడియాలో వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగిందని, అందుకే దాన్ని అక్కడే ఉండనివ్వమని రతన్ టాటా హోటల్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారట.
అంతేకాదు, టాటా వ్యాపార సామ్రాజ్య రాజధానిగా భావించే ‘బాంబే హౌస్’లో వీధి శునకాలుండడానికి ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేశారు. శునకాలంటే రతన్ టాటాకున్న ప్రేమకు ఇది నిదర్శనం. రతన్ టాటాకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన పెంపుడు శునకం ‘ గోవా’ కూడా రావడం గమనార్హం.
ఇక కొవిడ్ సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులను వదిలించుకోవడానికి వ్యతిరేకంగా ఆయన తీవ్రంగా గళమెత్తారు. ఉద్యోగులను వీధిన పడేస్తే కంపెనీల సమస్యలు తీరుతాయా? అంటూ ప్రశ్నించారు. కొవిడ్‌తో పోరాడేం దుకు ఏకంగా రూ.500 కోట్ల విరాళం ఇచ్చారు.ఇక ముంబయి ఉగ్రదాడిలో తాజ్ హోటల్ సిబ్బంది 11 మంది చనిపోతే వారి కుటుంబాలను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారి పిల్లల బాధ్యతను టాటా గ్రూపు చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
చనిపోయిన వారి మిగిలిన జీవిత కాలంలో వచ్చే జీతాన్ని ఆ కుటుంబాలకు చెల్లించారు. తన సంపదలో 65 శాతం చారిటీకే ఖర్చు చేశారు. ఇన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా ఆయన విమానాల్లో తరచూ ఎకానమీ క్లాసులోనే ప్రయాణించే వారు. అంతేకాదు, కారులో ప్రయాణించేటప్పుడు కూడా మిగతా వ్యాపారవేత్తల్లా కాకుండా డ్రైవర్ పక్కనే కూర్చుని ఎంజాయ్ చేసే వారు.
రతన్ టాటా లంచం, అవినీతి అనే పదాలను దరి చేరనివ్వలేదు. ఓ వ్యాపార ఒప్పందం కోసం సంబంధిత మంత్రికి రూ.15 కోట్లు ఇవ్వాలని ఓ స్నేహితుడు సలహా ఇవ్వగా తాను సున్నితంగా తిరస్కరించినట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 60 ఏళ్ల తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాల సొంతం కావడం వెనుక విమాన పరిశ్రమపై ఆయన ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక స్టార్టప్ కంపెనీలలో సైతం పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2015లో హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక టి-హబ్‌ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఈ రంగానికి మద్దతు అవసరమని ప్రకటించడమే కాకుండా ఆచరణలో సైతం చూపించారు.
లెన్స్ కార్ట్, ఫస్ట్ క్రై, ఓలా, స్నాప్ డీల్, కార్ దేఖో లాంటి ఎన్నో అంకుర సంస్థల్లో రతన్ టాటా పెట్టుబడులుపెట్టారు. మహోన్నత మానవతా వాది, దాత, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాసకోసం కృషి చేసిన రతన్ టాటా కోట్లాది దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.