calender_icon.png 24 September, 2024 | 5:53 AM

యుద్ధంతో మానవాళికి అపజయమే

24-09-2024 01:03:18 AM

సమిష్టి శక్తిలోనే విజయం

అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరం

ఐరాసలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూయార్క్, సెప్టెంబర్ 23: మానవాళి విజయం యుద్ధభూమిలో లేదని, సమిష్టి శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి సాధించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరం.

ప్రపంచ భవిష్యత్తు గురించి అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న వేళ మానవ కేంద్రీకృత విధానాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా పరిణమించింది. మరోవైపు సైబర్, సముద్ర అంతరిక్షం వంటి రంగాల్లో కొత్త సంఘర్షణలు మొదలవుతున్నాయి. ఇందులో ప్రపంచం తీసుకునే చర్యలు అందరి లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి అని మోదీ పిలుపునిచ్చారు. 

సిద్ధంగా భారత్ 

ప్రపంచ అభివృద్ధి కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ను మొత్తం ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించాలని సూచించారు. భారత్‌లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని, ఇందుకు సంబంధించిన అనుభవాలను సైతం గ్లోబల్ సౌత్‌తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. వాతావరణ మార్పులు, మానవ హక్కులు సహా 21వ శతాబ్దపు సవాళ్ల పరిష్కారానికి రూపొందించిన భవిష్యత్తు కోసం ఒప్పందం (ప్యాక్ట్ ఫర్ ది ఫ్యూచర్)ను ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మోదీ ప్రసగించారు. ఈ ఒప్పందాన్ని రష్యా సహా ఏడు దేశాలు వ్యతిరేకించినా యూఎన్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఒప్పందంపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదని రష్యా ఆరోపించింది. 

సీఈవోలతో రౌండ్ టేబుల్ మీట్

ఏఐ, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో భారత్ దృష్టి సారించిందని మోదీ అన్నారు. ఐరాస సమావేశానికి ముందు లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ రంగాల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు కృషి చేయడంలో ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో సాంకేతికత విస్తరణ ప్రపంచ ఆర్థిక వ్వవస్థను ఎలా ప్రభావితం చేస్తోంది? మాన వ శ్రేయస్సును ఎలా మెరుగుపరుస్తోంది? అనే అంశాలపై చర్చలు జరిగాయి.

ఈ చర్చల గురించి మోదీ ఎక్స్ వేదికగా సంతృ ప్తి వ్యక్తం చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరిన్ని అంశాలపై చర్చించామని, అందరిలో భారత్‌పై అపారమైన నమ్మకాన్ని చూ శానని, ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహించగా.. అమెరికాలోని టాప్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. వీరిలో సుందర్ పిచాయ్ (గూగుల్), జూలీ స్వీట్ (యాక్సెంచర్), శంతను నారాయణ్ (అడోబ్), అర్వింద్ కృష్ణ (ఐబీఎం), జెన్సన్ హువాంగ్ (ఎన్‌విడియా) తదితరులు ఉన్నారు.