17-03-2025 08:51:06 PM
నక్కవాగు కాలుషిత జలాల నుండి మంజీరా నదిని కాపాడాలి..
మంజీరా నది జలాల కలుషితంపై అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేలు చర్చించాలి..
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్...
కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఏటిగడ్డ లింగంపల్లి గ్రామస్తుల ధర్నా..
సంగారెడ్డి (విజయక్రాంతి): మంజీరా నదిని మరో మూసినది కాకుండా చూడాలని, నక్కవాగు కాలుషీత జలాల నుండి మంజీరా నదిని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఏటిగడ్డ లింగంపల్లి గ్రామస్తులు మంజీరా నది జలాలు కలుషితమైన నీళ్ల బాటిల్స్ తో సిపిఎం ఆధ్వర్యలో ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు కలుషితమైన నీళ్లను చూపెట్టడం జరిగింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించాలని పిసీబీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ... గతంలో మంజీరా నది జలాలు ఎంతో స్వేచ్ఛమైనవి, రుచికరంగా ఉండేవని మంజీరా నది పరివాహ ప్రజలు రోజు వారిగా స్నానాలు వంటలకు తాగేందుకు వాడుకునే వాళ్ళని అన్నారు.
ప్రస్తుతం కనీసం పశువులు సైతం తాగే పరిస్థితిలో లేవని అన్నారు. నక్కవాగు కాలుషిత జలాలు మంజీరా నదిలోకి చేరడంతో ఎంతో ప్రమాదకరంగా మారిందని అన్నారు. పరిశ్రమల నుండి వెదజల్లే కాలుషిత జలాలతో నక్కవాగు పూర్తిగా కలుషితమైందని అన్నారు. చౌటకూర్ మండలం ఏటిగడ్డ లింగంపల్లి వద్ద నక్కవాగు కాలుషిత జలాలు మంజీరా నదిలో కలవడంతో అక్కడ నుండి మంజీరా నది జలాలు పూర్తిగా కలుషితమైనాయని అన్నారు. మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాంతో కిందకు నీళ్లు పారకుండా నిలువ ఉండడంతో గ్రామంలోకి కంపు దుర్వాసన రావడంతో గ్రామస్తులు గాలి పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దోమల బెడద విపరీతంగా పెరిగిందని అన్నారు.
గ్రౌండ్ వాటర్ సైతం కలుషితంగా మారే పరిస్థితి ఉందని అన్నారు. మంజీరా నదిలో నీళ్లు కనిపించినంతగా గుర్రపు డెక్క పిచ్చి మొక్కలతో నిండిపోయిందని అన్నారు.. దీంతో ప్రజలకు అంటువ్యాధులు విష జ్వరాలు వస్తున్నాయని అన్నారు స్వచ్ఛమైన మంజీరా నది మరో ముసినది కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు నక్కవాగు నుండి కలుషిత జలాలను రాకుండా చర్యలు తీసుకోవాలని మంజీరా నది లో పెరిగిన గుర్రపు డెక్క పిచ్చి మొక్కలను తొలగించాలని నది పరివాహక గ్రామాల ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో ఏటిగడ్డ లింగంపల్లి గ్రామస్తులు శ్రీహరి రమేష్ మల్లేష్ శ్రీకాంత్ సాయిలు తదితరులు పాల్గొన్నారు..