మహిళలు, చిన్నారులు హత్యతో మైతీ ప్రజల్లో ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు
సీఎం, మంత్రుల నివాసాలపై దాడులు
అధికారులతో అమిత్‌షా అత్యవసర భేటీ
ఇంఫాల్, నవంబర్ 17: మణిపూర్ మళ్లీ అగ్నిగుండంలా మారింది. జరిబామ్ జిల్లాలో మైతీ తెగకు చెందిన ఓ కుటుంబంలోని ఆరుగురు మహిళలు, చిన్నారుల కిడ్నాప్, తర్వాత వారి మృతదేహాలు నదిలో తేలడం స్థానిక ప్రజలను కలిచివేసింది. మృతుల్లో 10 నెలల చిన్నా రి సైతం ఉండటంతో తీవ్ర కలకలం రేపుతోం ది. దీంతో శనివారం నుంచి రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. కుకీ మిలి టెంట్లే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తూ మైతీ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 24 గంటల్లో నిందితులను శిక్షించాలం టూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో జరిబామ్, రాజధాని ఇంఫాల్‌తో పాటు పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
సర్కార్ నుంచి ఎన్‌పీపీ ఔట్
అల్లర్లను అదుపు చేయలేకపోయిన నేపథ్యంలో మణిపూర్‌లో బీజేపీ సర్కారు నుంచి వైదొలుగుతున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలను అదుపులోకి తీసుకురావడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో బీరెన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో చెలరేగిన హింస వల్ల అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్‌పీపీ తెలిపింది. మణిపుర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా 53 స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఇందులో ఎన్‌పీపీకి 7 స్థానాలు ఉన్నాయి.
ప్రయత్నాలన్నీ విఫలం
శవినారం సాయంత్రం మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ వ్యక్తిగత నివాసంపైనా దాడులు చేశారు. ఆయన అల్లుడి నివాసంతో పాటు మరో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపైనా ఆందోళనకారులు దాడు లు చేశారు. వారి ఇళ్లల్లోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జిరిబామ్‌లో నివాసాలు, రెండు ప్రార్థనా స్థలాలకు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. వారిపై పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇళ్లల్లో దోపిడీలు, అల్లర్లకు పాల్పడుతున్న 23 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అమిత్ షా సమీక్ష
మణిపూర్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్య వసర సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన షా.. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిస్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మణిపూర్ అల్లర్ల నేప థ్యంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న ఆయన.. ఢిల్లీకి చేరుకుని ఈ సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం కూడా అధికారులతో షా భేటీ అవుతారని సమాచాం.
ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలి
రాష్ట్రంలో ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలని మైతీ పౌర హక్కుల సంఘం ప్రతినిధి ఖురైజామ్ అథౌబా డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవడంతో పాటు 24 గంటల్లో తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రజా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా, మణిపూర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన ఏఎఫ్‌ఎస్‌పీఏ బలగాలను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మణిపూర్ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
బీజేపీ హింసనే కోరుతోంది
మణిపూర్‌లో హింస నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మణిపూర్‌లో మంటల నే కోరుకుంటోందని ఆరోపించారు. బీజేపీ తన విభజన రాజకీయాల కోస మే ఇలా ఈశాన్య రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. మోదీ మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మణిపూర్ ఒక్కటే కాదు.. దేశం కూడా సురక్షితంగా లేదు’ అని ట్వీట్ చేశారు. ఏడాదిన్నరగా మణిపూర్ అట్టుడుకుతున్నా కానీ మోదీ అక్కడ పర్యటించ లేదని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సైతం ఆరోపించారు. మణిపూర్ పరిస్థితులు ఎంతో కలచి వేశాయని, ఇప్పటి కైనా మోదీ అక్కడ పర్యటించి శాంతిని నెలకొల్పాలని రాహుల్ కోరారు.