- మణిపూర్ వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ విఫలం
- మహారాష్ట్రలో మరాఠీ, ఓబీసీల మధ్య ఇదే తరహా వివాదం
- ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై, జూలై 29 : త్వరలోనే మహారాష్ట్రలోనూ మణిపూర్ తరహా హింసాత్మక సంఘటనలు చెలరేగే ప్రమాదం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముంబైలో నిర్వహించిన ‘సోషల్ యూనిటీ కాన్ఫరెన్స్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను అరికట్టడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఏడాది కాలంగా మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు సమూహాల మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. ఇదే తరహాలో మహారాష్ట్రలోనూ మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి నిరసనలు కొనసాగుతున్నాయి.
మణిపూర్ తర హాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, ఎంతో మంది మహనీయులు మహారాష్ట్ర లో సామరస్యాన్ని పెంపొందించారు. కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చని భావిస్తున్నాను. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలి. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు మరో వర్గంతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదు” అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
మణిపూర్‌లో ఏడాది కాలంగా హింస కొనసాగుతున్నా ఒక్కసారి కూడా మోదీ అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్‌కారం కోసం ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. తరతరాలుగా సామరస్యంగా మెలిగిన మణిపూరీ ప్రజలు నేడు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంలో కేంద్రం కూడా కారణమేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.