calender_icon.png 20 September, 2024 | 1:09 PM

ఉచితాల మ్యానిఫెస్టో

07-09-2024 01:49:23 AM

  1. కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ హామీలు 
  2. ఆర్టికల్ ౩౭౦ ఎప్పటికీ చరిత్రగానే మిగిలిపోతుంది 
  3. ఎన్సీ, కాంగ్రెస్‌కు అమిత్ షా కౌంటర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఆర్టికల్ 370 ఎప్పటికీ ఓ చరిత్రగానే మిగులుతుందని, మళ్లీ పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 యువత చేతికి ఆయుధాలు, రాళ్ల ను మాత్రమే ఇచ్చిందని, వారిని ఉగ్రవాదం వైపు నడిపించిందని అమిత్ షా ఆరోపించారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ పార్టీల ఎజెండాలు చూశాక ఈ విషయం ప్రజలకు చెప్పాలనుకున్నానని వెల్లడించారు.

ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా గుజ్జర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవ్వరినీ వెళ్లనివ్వమని అమిత్ షా స్పష్టం చేశారు.గత పదేళ్లలో జమ్ముకశ్మీర్ స్వర్ణ యుగాన్ని చూసిందని, శాంతితో కూడిన అభివృద్ధి, పురోగతి సాధిస్తోందని ఉద్ఘాటించారు. 

ఐదేళ్లు అవకాశమివ్వండి

జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాద ఆవిర్భావానికి కారణమెవరో శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఇక్కడ టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలి స్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తమకు ఐదేళ్ల పదవీ కాలాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జమ్ముకశ్మీర్‌ను టెర్రరిస్టు హాట్‌స్పాట్ నుంచి టూరిస్టు స్పాట్‌గా మారుస్తా మని పేర్కొన్నారు. 

మ్యానిఫెస్టోలో కీలక హామీలివే.. 

  1. ప్రతి కుటుంబంలో వృద్ధ మహిళకు ఏడాదికి రూ.18 వేలు
  2. ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితం
  3. కాలేజీ విద్యార్థులకు రూ.3 వేల ట్రావెల్ అలవెన్స్
  4. 5లక్షల మంది యువతకు ఉద్యోగాలు
  5. వైద్య కాలేజీల్లో వెయ్యి అదనపు సీట్లు 
  6. యూపీఎస్సీ, జేకేపీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ ఫీజు కోసం ఏటా రూ.10 వేలతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపు
  7. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
  8. వృద్ధ్యాప్య, వితంతు, దివ్యాంగుల పింఛను 3 రెట్లు పెంపు