29-03-2025 11:26:17 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీకి చెందిన మానసిక వికలాంగుడైన బర్ల మణివర్మకు సదరం స్లాట్ బుకింగ్ తో సంబంధం లేకుండా సదరం సర్టిఫికెట్ అందించి ఆదుకోవాలని మాదిగ హక్కుల దండోరా పట్టణ కన్వీనర్ కొలుగూరి విజయ్ కుమార్ కోరారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణి వర్మ తండ్రి గత నాలుగు నెలల క్రితం చనిపోయాడని, వారిది అత్యంత పేద కుటుంబం అని, ముగ్గురు చిన్నపిల్లలు ఆ పేద కుటుంబంలో మణివర్మ పెద్దవాడని, వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవన్నారు. 2019లో మణివర్మ కు సదరం సర్టిఫికేట్ 100 శాతం వైకల్యంతో ఐదు సంవత్సరాలకు రెన్యువల్ గా ఇచ్చారని, సర్టిఫికెట్ రెన్యువల్ కొరకు స్లాట్ బుక్ చేసుకుందామంటే బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే అవి అయిపోతున్నాయని, దాంతో వారు స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోతున్నారని తెలిపారు.
అనంతరం సదరన్ సర్టిఫికెట్ కొరకు మంచిర్యాలకు వెళ్ళగా, వైద్యులు మందులు వాడండి, రెండు నెలలు వాడితే బాబుకు తగ్గిపోతుందని సర్టిఫికెట్ ఇవ్వకుండా తిరిగి పంపించారన్నారు. దీంతో అతనికి వచ్చే పెన్షన్ ఆగిపోయిందని దీంతో వారికి ఎటువంటి ఆధారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి లు మానవత దృక్పథంతో మణివర్మ కు సాయం చేసి, స్లాట్ బుకింగ్ లేకుండానే సదరం సర్టిఫికెట్ అందించి, అతనికి పెన్షన్ అందించి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణివర్మ కుటుంబ సభ్యులు బర్ల శారద, లలిత లు పాల్గొన్నారు.