25-04-2025 12:25:54 AM
కలెక్టర్’ను కోరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): వ్యాపారుల దోపిడీ నుండి మామిడి రైతును కాపాడి వారికి మద్దతు ధరను కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురువారం కలెక్టర్ సత్యప్రసాద్’కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగిత్యాల జిల్లాలో వరి సాగుతో పాటు మామిడి, ఉద్యాన వన పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తుండడంతో మామిడి విక్రయాల కోసం 2008-09లో చల్గల్ వద్ద 25 ఎకరాలు మామిడి మార్కెట్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. మామిడి మార్కెట్లో ట్రేడర్లతో పాటు రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించేవిధంగా మార్కెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మామిడి రైతులకు దిగుబడి తగ్గడంతో పాటూ ట్రేడర్లు ట్రేడింగ్ నిబంధనలు పాటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో రైతులు దోపిడికి గురౌతున్నారన్నారు.
మామిడి మార్కెట్లో జరిగే అవకతవకలకు మార్కెటింగ్ అధికారులే బాధ్యత వహించాలన్నారు. మామిడి మార్కెట్లో జరుగుతున్న అవకతవకల విషయం గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మామిడి మార్కెట్లో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.