calender_icon.png 30 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాంగళ్య దాయిన్యై నమః

02-08-2024 12:00:00 AM

వేముగంటి శుక్తిమతి :

స్త్రీల హృదయాలలో అమ్మవారి అనుగ్రహం, చైతన్యం, విభూతి ఉంటాయి. ఆమెను ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరకు స్త్రీరూప ఆరాధనతోనే పూజ పరిపూర్ణమవుతుంది. కనుక, స్త్రీ ఎప్పుడూ మంగళ స్వరూపిణియే. మంగళగౌరీ పూజ చేసిన స్త్రీలకు శత్రుభీతి పోయి జీవితమంతా సుమంగళిగా సకల శుభాలతో ఆనందంగా జీవిస్తారు.

‘భగవతి మంగళ చండి ఉపాఖ్యానం’ ధర్మదేవుని నోటినుండి వెలువడిందని ‘శ్రీమద్దేవీభాగవతం’ పేర్కొన్నది. శృతి సమ్మతమైన ఈ ఉపాఖ్యానం విధ్వాంసులకు ప్రియమైంది. ఈ మంగళ చండి శుభాలు చేకూర్చడంలో సమర్థురాలు. ‘మంగళం’ అంటే ‘శుభప్రదం’. ‘చండి’ అంటే ‘ప్రతాపవంతురాలు’. శుభకార్యాలలో మంగళాన్ని చేకూర్చేది. కనుకే, ఆమె ‘మంగళ చండి’ అయింది. మూల ప్రకృతి దుర్గాదేవి రూపాంతరమే మంగళ చండి. స్త్రీలు వివాహం కాకముందు ‘మంగళచండి’గా, వివాహమైన తర్వాత ‘మంగళగౌరి’గా ఈ తల్లిని పూజిస్తారు. 

వర్షఋతువులో శ్రావణమాసం మొదటిది. ఈనెల రోజు లు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి రోజు ఒక పర్వదినమే, విశిష్టమైన రోజే. అందుకే, ఈ నెలలోనే మహిళలం దరూ ఆనందమైన వాతావరణంలో గౌరీదేవిని, మహాలక్ష్మిదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెల పొడుగునా ప్రతి మంగళవారం ఆచరించేది ‘మంగళగౌరీ’ వ్రతం. 

వైవాహిక జీవితానికి ముందు..

మంగళవారానికి అధిపతి కుజుడు. ‘మంగళ్’ అంటే కుజుడు. చంద్రుడు పౌర్ణమినాడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి, ఇది శ్రావణమాసం. చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. మాసమేమో చంద్రునికి సంబంధించింది. వారమేమో కుజుడికి సంబంధించింది. అన్ని గ్రహాలకు ఇళ్ళున్నాయి. కానీ, రాహుకేతువులు ఏ రాశి ఇంట్లోవున్నా కుజుడి వలెనే అనుకూలమైన వారు కాదు. ఇక, కుజుడు విచిత్రమైన ప్రవృత్తి కలవాడు. కలహ ప్రియుడు. అందుకే, వివాహమైన నూతన వధువుకు భర్తతోపాటు అత్తింటి వ్యక్తులు, ప్రవృత్తులు, ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉండడం సహజం. అలాంటి సందర్భాలలో కుజుడు నూతన వధూవరుల మధ్య విభేదాలు, మనస్పర్ధలు కలగాలని చూస్తుంటాడు.

కనుకే చంద్రుడు, కుజుడు, రాహువులను ప్రసన్నం చేసుకోవాలి. అందుకే, వివాహ సమయంలో నూతన వధువుతో అన్ని మంగళములను, సకల సౌభాగ్యాలను, ధైర్యాన్ని, సద్బుద్ధిని, ఓర్పును, నేర్పును, అనుకూల దాంపత్యాన్ని ప్రసాదించాలని వారితో ‘మంగళగౌరీ’ పూజ చేయిస్తారు. జాతకరీత్య వరునికి దోషాలున్నా, వధువుకు వున్నా, లేకపోయినా ఆమె చేసే మంగళగౌరీ పూజవల్ల వారిద్దరి దోషాలన్నీ నివృత్తి అవుతాయి. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టే ముందు ప్రతి మగువకు ఇది చాలా ప్రధానమైంది.

నూతన వధువులకు సంపూర్ణ రక్ష

సర్వసౌభాగ్యాలనిచ్చే తల్లి ‘మంగళగౌరీ’. ఈ పేరు మీదే మంగళసూత్ర ధారణ జరుగుతుంది. వివాహానికి ముందు బ్రాహ్మణుడు గౌరీదేవిని ఆవాహన చేసి మంగళసూత్రాన్ని శతనామార్చనతో, షోడశోపచారాలతో, పసుపు కుంకుమలతో పూజ చేయించి, వరునితో వధువుకు మంగళ సూత్రధారణ చేయిస్తాడు. గౌరీదేవిని ఆరాధించడం వల్ల ఆ తల్లి అనుగ్రహంతో నూతన వధువుకు సకల సౌభాగ్యాలు, సంపూర్ణ రక్ష చేకూరుతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. అనాదిగా మన భారతీయ సంస్కృతిలో వివాహమైన వెంటనే శ్రావణమాసంలో ప్రతీ స్త్రీ ఆచరించటానికి వీలుగా మన పెద్దలు ఏర్పాటు చేసిన మహిమాన్విత వ్రతం ‘మంగళ గౌరీ’. మూలప్రకృతి దుర్గాదేవి రూపాంతరమే మంగళ చండి కనుక, సృష్టి స్థితులలో మంగళగా, లయలో చండీగా ఉంటుంది. ధర్మం, పుణ్యం ఉన్నచోట మంగళగా, అధర్మం ఉన్నప్పుడు చండిగా ఈ తల్లి అవతారం దాలుస్తుంది. 

దీపజ్యోతి కాటుకతో కొత్త కాంతి

గౌరీదేవి అంటేనే నిత్య సువాసిని. ఆమెను పూజించిన వారికి కలకాలం ఐదవతనం సిద్ధిస్తుంది. నదుల్లో దొరికే ఎర్ర రాతిని గౌరీదేవికి ప్రతీకగా చెప్తారు. ఈ గౌరీ పూజ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. పుష్పాలలో, పసుపు కుంకుమల్లో, అక్షతల్లో మంగళ గౌరీదేవి నెలవై ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆవు నేతి దీపాల జ్యోతిలోనూ ఆమె కొలువు దీరుతుందని వేదం చెప్పింది. ముఖ్యంగా ఈ వ్రతంలో కాటుకకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మంగళగౌరీ అలంకార ప్రియురాలు. ఆ తల్లికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. ఆమె 44 రకాల సుగంధ ద్రవ్యాలతో, 44 రకాల ఆభరణాలతో నిత్యం శోభాయమానంగా వెలుగొందుతుందని పురాణకథలు చెబుతున్నాయి. ముత్తయిదువలు గౌరీవ్రతాన్ని నోముకుంటున్నప్పుడు ఈ నలభై నాలుగు రకాలు కాకపోయినా పసుపు కుంకుమ, గంధం, కాటుక తప్పక పూజలో ఉండాలని నియమం. కాటుకతో ఆడవారి కళ్లకు కొత్త కాంతి వస్తుంది. బాహ్య ప్రపంచంలోని ధార్మిక అంశాలపై వారి దృష్టి నిలుస్తుందని పెద్దలు అంటారు. లోకంలోని మంచి చెడు వ్యత్యాసాలను తెలుసుకోగలుగుతారు. 

మంగళగౌరీ వ్రతం చేసుకుని కాటుక ధరించిన సుశీల అల్పాయుష్షుడైన తన భర్తను పూర్ణాయుష్షుడుగా చేసుకొంటుంది. వ్రతంలో భాగమైన ఆ కాటుక ద్వారా తన అత్తమామల కంటిచూపును కూడా తేగలుగుతుంది. వ్రతం చేసుకున్న మహిళలు ముత్తయిదువులకు మిగిలిన వాయనంతోపాటు కాటుకనూ తప్పనిసరిగా ఇస్తారు. దానిని ధరించటం వల్ల ముత్తయిదువులంతా సర్వ సౌభాగ్యవతులవడమేకాక కంటిలోని రుగ్మతలనూ దూరం చేసుకొంటారు. ‘మంగళగౌరీ’ వ్రతంలో కాటుకను స్వయంగా తయారు చేసుకోవాలి. ఆవునెయ్యి దీపాలపై ఇత్తడి గరిటను బోర్లించినప్పుడు దానికి స్వచ్ఛమైన నల్లని పదార్థం పడుతుంది. దానికి ఆవునెయ్యి కలిపి కాటుకను తయారుచేస్తారు. ఈ కాటుకతో కంటి ఆరోగ్యం మెరుగవుతుందని వేదం చెప్పింది. 

అన్ని మంగళవారాల్లోనూ..

వ్రతం అయిన తర్వాత వ్రతకథ చదువుతున్న సమయంలో దీపాలు వెలిగించి గరిటకు ఒక తోరాన్ని కట్టి కాటుకను తయారుచేస్తారు. కొత్తగా వివాహమైన ఆడపిల్లలు ఐదు సంవత్సరాల వరకు (ప్రతీ ఏడాది) శ్రావణమాసంలో వచ్చే అన్ని (నాలుగు లేక ఐదు) మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తారు. ముందుగా పసుపు విఘ్నేశ్వరుని అదే విధంగా మరొక పసుపు ముద్దలో అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజిస్తారు. పూర్ణ విశేషాన్ని పొందటానికి ఈరోజు పూర్ణంతో బూరెలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. 

ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. ప్రతి ఒక్కరిలోను అమ్మవారి కళ ఉంటుంది. రెండేళ్ల వయసు నుండి మరణ పర్యంతం స్త్రీని అమ్మవారి భావనతో ఆరాధిస్తూ ‘కుమారి, బాల సువాసిని, గంగా భాగీరధీ సమాన’ అంటూ స్త్రీలను ప్రతి దశలోనూ గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీల హృదయాలలో అమ్మవారి అనుగ్రహం, చైతన్యం, విభూతి ఉంటాయి. ఆమెను ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరకు స్త్రీరూప ఆరాధనతోనే పూజ పరిపూర్ణమవుతుంది. కనుక, స్త్రీ ఎప్పుడూ మంగళ స్వరూపిణియే. మంగళగౌరీ పూజ చేసిన స్త్రీలకు శత్రుభీతి పోయి జీవితమంతా సుమంగళిగా సకల శుభాలతో ఆనందంగా జీవిస్తారు.