- భక్తిశ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
- ఎనిమిదో రోజు దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 10: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్, అర్చకులు మండపంలో ప్రత్యేక పూజ లు చేశారు.
అష్టమిని పురస్కరించుకొని చండీ కలశ ప్రతిష్ఠ, చండీ హవనం చేపట్టా రు. రాత్రి మహిషాసురమర్దినికి మహాపూజ నిర్వహించారు. హనుమకొండలోని భద్రకాళీ ఆలయంలో అమ్మవారు దుర్గామాతగా దర్శనమిచ్చారు. భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నా రు.
నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అలయంలో అమ్మవారు మహాగౌరి అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగళిని నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవో రామారావు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బెల్లంపల్లి పట్టణంలోని వాసవీ మాత ఆలయంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వాహకులు అమ్మ వారిని రూ.60 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు.