calender_icon.png 31 January, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణాకు మంగళహారతి!

26-01-2025 01:28:55 AM

* మన ఇసుక వాహనానికి గ్రామస్తుల అడ్డు పుల్ల

* నడిగడ్డ ఇసుక రీచ్ వద్ద గ్రామస్తుల వంటావార్పు

* కలెక్టర్ ఆదేశించినా పాటించని రెవెన్యూ, పోలీస్ అధికారులు 

* తెర వెనుక సహకరిస్తున్న ఇసుక మాఫియా గ్యాంగ్

నాగర్‌కర్నూల్, జనవరి 25 (విజయక్రాంతి) : సహజ సిద్ధంగా దొరికే ఇసుకను అక్రమార్కులు రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ మార్గాన తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అడిగిన ప్రతివారికి నెల నెలా ముడుపులందించడంతో సంబంధిత అధికారులంతా ఇసుక మాఫియాకు అడుగడుగునా హారతులు పడుతున్నారు.

కానీ నిబంధనల ప్రకారం మన ఇసుక వాహనాన్ని అమలు చేసే క్రమంలో మాత్రం  అడుగడుగునా గ్రామస్తుల చేత అడ్డు పుల్ల వేయిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మన ఇసుక వాహనం ప్రారంభం దశలోనే గ్రామస్తులు వంటావార్పు చేపడుతూ ఉద్యమానికి తెర లేపడం వెనక భారీ కుట్ర దాగి ఉందని సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డగోలుగా ప్రధాన రోడ్ల వెంట రయ్ రయ్ మంటూ ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ల వల్ల రోడ్డు ప్రమాదాలతో పాటు సౌండ్ పొల్యూషన్, రోడ్డు డ్యామేజ్ వంటివి జరుగుతూనే ఉన్నా  సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీస్ ఇతర శాఖలన్నీ పట్టించుకోకపోవడం వెనక ఇసుక మాఫియా గ్యాంగ్ హస్తం తాగి ఉందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.  అడుగడు గునా ముడుపులు ముట్టజెప్పడం వల్లే అక్రమ దందా సాఫీగా జరుగుతోందని సామాన్యుల నుండి విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల ఓ సామాన్య నిరుపేద కుటుంబం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఇల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో ట్రాక్టర్ ఇసుక సుమారు 6500 ధర పలుకుతుండగా ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు ఇసుకకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మన ఇసుక వాహనాన్ని కట్టుదిట్టంగా అమలు పరచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మొదటగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మన ఇసుక వాహనాన్ని అమలు చేయాలని నిర్ణయిస్తూ దుందుభి పరివాహక ప్రాంతమైన తెలకపల్లి మండలం నడిగడ్డలో ఇసుక రీచ్ ను గుర్తించింది. 

కొంత మంది ట్రాక్టర్ వాహనదారులు మన ఇసుక వాహనం పథకంలో దరఖాస్తు చేసుకోగా సామాన్యులు కూడా ఇసుక కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు సాఫీగానే జరిగినా గుర్తించిన రీచ్ నుండి ఇసుకను తరలించే వీలు లేదంటూ గ్రామస్తులు అడ్డుపుల్ల వేస్తున్నారు. శనివారం నడిగడ్డ శివారులోని ఇసుక రీచ్ వద్ద గ్రామస్తులు వంటవార్పు కార్యక్రమాన్ని చేపడుతూ అక్కడికి వచ్చిన మన ఇసుక వాహనాన్ని అడ్డుకొన్నారు.

వీరికి పరోక్షంగా ఇసుక మాఫియా గ్యాంగ్ తెరవెనక సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన ఇసుక వాహనం సమగ్రంగా అమలు జరిగితే సామాన్య జనానికి తక్కువ ధరకు ఇసుక అందడంతో పాటు ప్రభుత్వానికి మాత్రమే ఆదాయం పెరుగుతుందని అక్రమార్కులకు మొక్కుతాడు పడుతుందన్న భయంతో అడ్డుకునే కుట్రలకు తేరలేపుతున్నట్లు చర్చ జరుగుతుంది.

మన ఇసుక వాహనం వల్ల జరిగే ప్రయోజనాలను కూడా ఆయా సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ప్రచారం జరుగుతుంది. అర్ధరాత్రిలు దుందుభి వాగులో అక్రమంగా ఇసుకను తోడే వాహనాలను అడ్డుకోవడం సాహసించని గ్రామస్తులు అధికారులు మన ఇసుక వాహనాన్ని మాత్రం అడ్డుకోవడం కొసమెరుపు.