ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో ఉన్న దేవునిగుట్ట మీద అపూర్వమైన రాతి ఇటుకల దేవాలయం ఉంది. ఒకే గర్భగుడితో ద్రావిడశైలి విమానంతో, రెండుపొరల రాతిగోడలతో నిర్మాణమైన ఈగుడి లోపలి గోడల మీద బుద్ధుని బోధనలు వింటున్న రాజులు, రాణులు, పరివారజనుల దృశ్యాలు, జాతకకథలకు సంబంధించిన కథల శిల్పాలున్నాయి. గుడి బయటి గోడల మీద బౌద్ధ ప్రతిమాలక్షణాలతో ద్వారపాలకులు, మిథునాలు, కలశాలు, బోధిసత్వుని శిల్పాలు, జంభాలుడు బౌద్ధజాతకకథ, స్కంధ, గణేశులతో అర్థనారీశ్వర కథ బహురూప ప్రదర్శన, మాంధాత జాతకకథలోని రాచకొలువు దృశ్యాలతో, సోపానక్రమంగా అనేక శిల్పాలు విమానం ఎత్తుకు చెక్కబడి కనిపిస్తున్నాయి.
దేవాలయం బయట బౌద్ధ స్తూపానికి చెందిన విరిగిన పాలరాతి ఆయకస్తంభమొకటి కనిపిస్తున్నది. దానిపై చెక్కిఉన్న అర్ధపద్మాలు, సింహ శిల్పాలను బట్టి ఇది క్రీ.శ.1వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారుల అభిప్రాయం. గుడి, గుడిలోని శిల్పాలు పల్లవ, బాదామీ చాళుక్యులనాటి శైలిని కొంత ప్రతిబింబిస్తున్నాయి.
గుడికి దక్షిణంవైపు గోడమీద అజంతా చిత్రాలలోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో రాణితో కూర్చున్న దృశ్యం ఉంది. నాట్యగత్తె నాట్యం చేస్తున్నట్లు ఉంది. అటిటు రెండుపక్కల బోధిసత్వుని అవతార రూపాల శిల్పాలున్నాయి. పైన ఫ్రేముల్లోనూ బుద్ధ బోధనల దృశ్యాలే కనిపిస్తాయి.
ఇది బౌద్ధ జాతక కథల్లో మాంధాత జాతకకథ
బౌద్ధ జాతకకథలు: మాంధాత కథ (258వ జాతకకథ)
జేతవనంలో బుద్ధుడు ఈ కథను ఒక బౌద్ధభిక్షువు కోసం చెప్పాడు. ఒక భిక్షుక సోదరుడు సావత్తిలో భిక్ష కోసం వెళ్ళినపుడు అందంగా దుస్తులలో కనపడ్డ స్త్రీ ప్రేమలో పడ్డాడు. అతణ్ణి సత్యమందిరానికి తీసుకునివచ్చి గురువుగారికి విషయం చెప్పాడు సహచరభిక్షువు. ‘ఔనా’ అంటే అతడౌనని సమాధానమిచ్చాడు. బోధకుడు ‘ఈ కోరికెప్పటికి తీరేదికాదు, ఇది సముద్రమటువంటిది.
సంతృప్తిపరచలేవు. గృహస్తునివైనా. 36 సక్కాల ఆవాసంలోనైనా, 4గురు గొప్పప్రభువులున్న స్వర్గంలోనైనా, 2వేల ద్వీపాలతో చుట్టబడి ఉన్న చతుష్కండాలలోనైనా, నియంతలైనా . ఎవరు కోరికను తృప్తిపరచుకున్నవారే లేరు.’ అని అన్నాడు. ఒక పాతకథను బోధించాడు. అనగనగా ఈ ప్రపంచపు తొలిరోజుల్లో మహాసమ్మత అనే రాజుండేవాడు.
అతనికి రోజ అనేకొడుకు, అతనికి వరరోజ అనే కొడుకు, అతనికి కళ్యాణ అనే పుత్రుడు, అతనికి వరకళ్యాణ, వరకళ్యాణకు ఉపసోథ, అతనికి మాంధాత కొడుకు. అతనికి సప్తదివ్యవస్తువులు, నాలుగు లోకాతీతశక్తులుండేవి. అతడొక నియంత. అతడు తన ఎడమచేతితో కుడిచేతిని ముట్టుకోగానే ఎనిమిదిరకాల రత్నాల వర్షం మోకాలు మునిగేంత కురిసింది.
యువరాజుగా 84 వేలయేండ్లు. అంతేకాలం రాజ్యాధిపతిగా, మరెన్నోయేండ్లు లెక్కలేనన్ని యుగాలు జీవించాడు. ఒకరోజు అతని ఒక కోరిక తీరలేదు. విచారంగా ఉన్నాడు. కొలువుకూటంలోని వారు ఎందుకట్లున్నారని రాజుని అడిగారు. రాజు ‘ఇదే రాజ్యమని, కోరుకోదగిన ప్రదేశమేదని’ అడిగాడు. స్వర్గమని వారు చెప్పారు.
చక్రవర్తిత్వంతోనే స్వర్గానికి వెళ్ళాడు. అక్కడున్న 4గురు రాజులు తనను ఆహ్వానించారు. దైవికమైన పూలు, పరిమళద్రవ్యాలిచ్చారు. తానక్కడ సుదీర్ఘకాలం పాలించాడు. కానీ, తన కోరికేదో తీరని అసంతృప్తి అట్లానే ఉంది. మళ్ళీ నిరాశతో, సుస్తీగా అయిపోయాడు.
ఆ నలుగురు రాజులు ‘ఓ రాజా, మీరెందుకు తృప్తిగాలేరు?’ అన్నారు.
‘స్వర్గంకన్న మిన్నయైన తావేది?’ అని అడిగాడు మాంధాత.
వారు ‘మేం సేవకులవంటివారం. 33వ స్వర్గం దీనికంటే గొప్పదంటారు’ అని చెప్పారు.
మాంధాత తన రాజ్యాన్ని, కొలువు కూటాన్ని అక్కడికే మార్చాడు. దేవతలరాజు సక్క మాంధాతకు ఎదురొచ్చి దివ్య పుష్పాలు, పరిమళాలనిచ్చి, తోడ్కొనిపోయాడు. సక్క మాంధాతను 33వ స్వర్గంలోని తీసుకునిపోయాడు. అర్థరాజ్యమిచ్చాడు. సక్క వందవేలకు 60 రెట్లకాలం బతికాడు. 30 లక్షల సం.రాలు జీవించి, భూమ్మీద మళ్ళీ తిరిగిపుట్టాడు.
మాంధాతకు ‘నాకు ఈ సగరాజ్యమేమిటి? సక్కను చంపి మొత్తం ఆక్రమించుకుంటాను’ అనుకున్నాడు. కానీ, అతనికది సాధ్యపడలేదు. కోరిక అట్లే ఉండిపోయింది. అతని జీవనశక్తి కుంటువడ్డది. ముసలితనం ఆక్రమించింది. మాంధాత స్వర్గం నుంచి భూమ్మీద ఒక తోటలో పడిపోయాడు. తోటమాలి అతడు రాజని ఎరిగి, అతనికి విశ్రాంతి ఏర్పాట్లు చేశాడు. కానీ రాజు అలిసిపోయి ఉన్నాడు. అతని కొలువులోని అధికారులు, ‘మీ నుంచి ఏ మాట తీసుకోవాలి’ అని అడిగారు.
అపుడు మాంధాత, ‘నా నుంచి ప్రజలకు సందేశం తీసుకెళ్ళండి. రాజులకు రాజు మాంధాత భూగోళంలోని నాలుగుఖండాలను పాలించాడు. స్వర్గంలోని 4గురు రాజులమీద రాజుగా వున్నాడు. 36 సక్కల మీద పెత్తనం చేసాడు. కానీ ఉత్తగే ఇపుడు చచ్చిపోయాడు.’ అంటూ మరణించాడు.