ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం డిమాండ్..
మందమర్రి (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామపంచాయతీగా ప్రకటించి వెంటనే ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ విగ్రహం నుండి రామన్ కాలనీ మీదుగా మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతి పత్రం అందజేసి పాలకులకు కనువిప్పు కలిగించి ఎన్నికలు నిర్వహించాలని అంబేద్కర్ ను కోరారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ.. షెడ్యూల్ ఏరియాలో ఉన్న మందమర్రిని మున్సిపాలిటీగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే గ్రామపంచాయతీగా ప్రకటించి ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్ధంగా గ్రామపంచాయతీగా కొనసాగుతున్న గ్రామంలో వృత్తి రీత్యా, ఉపాధి కోసం వచ్చిన వలస వచ్చినా జనాభాను లెక్కగడుతూ మున్సిపాలిటీగా ప్రకటించడం సరైనది కాదన్నారు. ఎన్నికలు లేక గత 30 ఏళ్లుగా ప్రాథమిక హక్కు ఆయన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే మున్సిపాలిటీనీ రద్దు చేసి గ్రామ పంచాయతీగా ప్రకటించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం జిల్లా నాయకులు పెద్ది భార్గవ్, లౌడం రాజ్ కుమార్, మేసినేని అరుణ్ కుమార్, మండల అధ్యక్షులు సిద్దని రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లె పృథ్విరాజ్, హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు గంజి రాజన్న, తుడుందెబ్బ నాయకులు జేక శేఖర్, కిషన్, హన్మంతు, జంగు, కనక రాజు, గ్రామ పెద్దలు పెద్ది రాజన్న, సెనేని మల్లేష్, కూన సత్యం, మేసినేని నాగేష్, సంతు, తిరుపతి, రాజేశ్వరి, లలిత, దేవకీ లు పాల్గొన్నారు.