28-02-2025 06:42:58 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మాదిగ అమరుల త్యాగాలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ పోరాటాన్ని 30 ఏండ్ల పాటు సజీవంగా నిలిపింది, త్యాగాలు చేసిన కార్యకర్తలే అని అన్నారు. వారి త్యాగాల పునాదుల మీదనే మందకృష్ణ బోగాలు అనుభవిస్తున్నాడని అన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ములుగు అంజయ్య-ఇందిరమ్మ, నడిమింటి కావేరి, పొన్నాల యాదయ్యలతో కలసి ఆయన మాట్లాడుతూ... అగ్రకుల నేతల ఇండ్లలో పెండ్లిలకు, చావులకు పోయే సమయం ఉంటుందని, కానీ అమరుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణ ఫలితం అమరవీరుల త్యాగ ఫలితమన్నారు. ఈ వర్గీకరణ విజయాన్ని అమరులకు అంకితం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మత తత్వ భాజాపాతో కుమ్మకైన మందకృష్ణ ఎస్సి రిజర్వేషన్ అమలు కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాలలో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని, 19న రాజకీయాలకు అతీతంగా సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమరుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం, రూ.50లక్షల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు అమరుల స్మారకంగా స్థూపం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, చాప కృష్ణ, కొల్లూరి వెంకటేష్, యదన్న, శాంతి కిరణ్, నవీన్ కుమార్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.