బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): బీసీ కులగణన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గురువారం గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ... బీసీల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. కుల గణనకు కాలాయాపన అవసరం లేదని, గత ప్రభుత్వం ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి జనాభా లెక్కించిందన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి కుల గణన చేపట్టి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. బత్తుల సిద్ధేశ్వర్ ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆయన ఆరోగ్యానికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీసీల కులగణన, రిజర్వేషన్ల సాధన పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతుగా ఉంటుందని, అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలో భాగస్వాములవుతామని తెలిపారు. పరామర్శించిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు, నరేశ్ మాదిగ, బీసీ నేత రాజారాం యాదవ్, ఎంఎస్‌పీ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ, రామారపు శ్రీనివాస్ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, బైరపోగు శివకుమార్ పాల్గొన్నారు.