11-12-2024 01:25:03 PM
హైదరాబాద్: ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు మంచు విష్ణు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పుని విష్ణు తెలిపారు. మా ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని మీడియాను కోరారు. నిన్నటి ఘర్షణలో మా నాన్నకు కొన్ని గాయాలయ్యాయి. కన్నప్ప పోస్టుప్రొడక్షన్ పని మీద లాస్ ఏంజెల్స్ లో ఉండగా ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే అమెరికా నుంచి వచ్చేశానని విష్ణు వెల్లడించారు. నేను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతోందని ఆశిస్తున్నానని విష్ణు పేర్కొన్నారు.
నిన్నటి ఘటన ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడి కాదన్న విష్ణు మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్ణకరం అన్నారు. నాన్న నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారు. మొహంమీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని వివరించారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడాని తెలిపారు. నిన్నటి ఘటన అలా జరిగి ఉండకూడదన్నారు. తమకు పోలీసుల నోటీసుల రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ సరెండర్ చేయాలని నిన్ననే ఆదేశించినట్లు మీడియాలో వచ్చిందని ఆరోపించారు.
గన్ సరెండర్ పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు నోటీసులు ఇచ్చారని విరరించారు. విచారణకు రావాలని ఉదయం 9.30 గంటలకు నోటీసు వచ్చిందన్నారు. ఉదయం 9.30 నోటీసు ఇచ్చి, 10.30కు విచారణకు రమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. కమిషనర్ పై ఉన్న గౌరవంతో విచారణకు వెళ్తానని చెప్పారు. ఏ ప్రాతిపదికన నాకు నోటీసులు ఇచ్చారు..? ఘటన జరిగినప్పుడు దేశంలోనే లేను, నాకెలా నోటీసు ఇస్తారని ప్రశ్నించారు. సీపీని కలవాల్సిన అవసరం నాకు లేదు.. అయినా కలుస్తానని మంచు విష్ణు వివరించారు. డిసెంబర్ 10న హైదరాబాద్ జలపల్లిలోని ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నివాసంలోకి ఆయన కుమారుడు మంచు మనోజ్ ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.