మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి) : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరించిన మంచిర్యాల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్‌వో) వాజిద్‌ను సస్పెండ్ చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఏప్రి ల్ 4 నుంచి 15 వరకు విధులకు గైర్హాజరవడం, అలాగే ఏప్రిల్ 10న వీసీ ఉంటుందని సమాచారం ఇచ్చినా హాజరు కాకపోవడం, ఏప్రిల్ 15న ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌పై జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు.
ఈ నెల తొమ్మిదిన పెద్దపల్లి జిల్లాలో రైస్‌మిల్లులను విజిట్ చేయడానికి వెళుతున్నానని చెప్పి హైదరాబాద్‌కు వెళ్లారు. విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టు కొని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలో మంచిర్యాల హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండకపోవడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ఆయన అనుమతి లేకుండా జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.