calender_icon.png 11 January, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానస్ సరోవర్ యాత్రకు ఓకే

20-12-2024 12:31:00 AM

* బీజింగ్‌లో ప్రత్యేక ప్రతినిధుల సమావేశం

* చైనా విదేశాంగ మంత్రితో అజిత్ దోవల్ భేటీ

* ఆరు అంశాలపై భారత్ ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: కైలాస్ మానస్ సరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు భారత్ అంగీకారం తెలిపాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగ్గా ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో దోవల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు మొత్తం ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర పునరుద్ధరణ, టిబెట్ వంటి ప్రాంతాల్లో సరిహద్దు పర్యాటకం, నాథులా సరిహద్దు వాణిజ్యం వంటి అంశాలు ఉన్నాయి.

ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరు చేసి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ విధానం వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ఇతర సంబంధాలపై పడే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర అంగీకార పరిష్కారానికి కృషి చేస్తూ శాంతిని కొనసాగించాలని ఇరు దేశాలు తీర్మానించుకున్నాయి.

వచ్చే ఏడాది భారత్‌లో ప్రత్యేక ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఇదిలా ఉంటే భారత్ మధ్య ప్రత్యేక ప్రతినిధుల సమావేశం చివరిసారిగా 2019లో జరిగింది. ఆ తర్వాత చైనా సైనికుల వైఖరి వల్ల తూర్పు లడ్డాఖ్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కజాన్‌లో ప్రత్యేకంగా భేటీ అయి ఇరు దేశాల సమస్యలపై చర్చించారు. దీంతో సరిహద్దులో తిరిగి పెట్రోలింగ్ ప్రారంభంకావడంతోపాటు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణ కాస్త సద్దుమణిగింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని సమస్యల పరిష్కారం కోసం దోవల్  చైనాలో పర్యటిస్తున్నారు.