హెచ్‌ఎం, టీచర్ల సొంత డబ్బుతో వస్తువుల కొనుగోలు
పారిశుధ్య నిధులకూ దిక్కు లేదు.. కానీ, స్పోర్ట్స్ క్యాలెండర్ అమలుకు సర్కార్ నిర్ణయం
ప్రభుత్వ వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అసంతృప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): విద్యాసంవత్సరం ఆరంభమై మూడునెలలు పూర్తి కావొసున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు సర్కార్ బడులకు నిర్వహణకు సంబంధించిన మొదటి గ్రాంట్‌ను మాత్రం విడుదల చేయలేదు. దీంతో చాక్‌పీసులు, రిజిస్టర్లు, డస్టర్లు, స్టేషనరీ వస్తువులను ప్రధానోపాధ్యాయులు, టీచర్లే తమ జేబుల్లోంచి సొంత డబ్బు తీసి వెచ్చించాల్సి వస్తున్నది.
ఒక్క స్కూల్ గ్రాంట్స్ నిధులే కాదు.. పారిశుధ్య నిర్వహణ, స్పోర్ట్స్ నిధులు కూడా విడుదల కాకపోవడం శోచనీయం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సాధారణంగా సర్కారు ఏడాదిలో రెండుసార్లు నిర్వహణ నిధులు విడుదల చేయాల్సి ఉంది. విద్యాసంవత్సరం ఆరంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను మధ్యలో విడుదల చేయాలి. కానీ, గతేడాది లాగానే ఈసారి కూడా నిధుల విడుదల్లో జాప్యం జరుగుతోంది.
నిధుల కేటాయింపు ఇలా..
రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 18 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలు 3,145 , ఉన్నత పాఠశాలలు 4,701. సర్కార్ ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏటా నిర్వహణ నిధులు విడుదల చేయాల్సి ఉన్నది. 1 30 మంది విద్యార్థులు ఉంటే రూ.10 వేలు, 31 మంది ఉంటే రూ.25 వేలు, 101 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యిమంది వరకు ఉంటే రూ.75 వేలు మంజూరు చేయాల్సి ఉంది. ఇక వెయ్యి మందికిపైగా ఉంటే ఏకంగా రూ.లక్ష విడుదల చేయాలి.
ఈ నిధులతో నే యాజమాన్యాలు రిజిస్టర్లు, టీచింగ్ డైరీ, బ్లాక్ బోర్డులు, చాక్‌పీస్‌లు, ప్రయోగాలకు అవసరమయ్యే సామగ్రి, జవాబు పత్రాల కొనుగోలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆగస్టు 15, జనవరి 26, రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.సర్కార్ తాజాగా విద్యాక్యాలెండర్ తరహాలోనే స్పోర్ట్స్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహిస్తామని పేర్కొన్నది. అసలు సాధారణ, నిర్వహణ నిధులే విడుదల కాకుంటే.. ఇక స్పోర్ట్స్‌కు దిక్కేంటి? అనే ప్రశ్న ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాల నుంచి వ్యక్తమవుతున్నది.
సీఎం ఇచ్చిన హామీ ఏమైంది?
గత నెల 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీచర్ల పదోన్నతుల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని ప్రకటించారు. ఆ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగిస్తామని కూడా వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ ఇదే నెల 6న ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. వేసవి సెలవులు మినహా మొత్తం 10 నెలలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు ఇవ్వవనున్నట్లు ప్రకటించింది.
పిల్లల సంఖ్యను బట్టి నెలకు కనిష్ఠంగా రూ.3 వేలు, గరిష్ఠంగా రూ.20 వేలు మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. కానీ ఇంత వరకూ పారిశుధ్య నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ నుంచి నిధులు విడుదల చేసి ఆదర్శ కమిటీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. ఒక బడిలో 1- 30 మంది విద్యార్థులు ఉంటే నెలవారీగా రూ.3 వేలు, 31- 100 మంది ఉంటే రూ.6 వేలు, 101- 250 మంది ఉంటే రూ.8 వేలు, 251- 500 మంది ఉంటే రూ.12 వేలు, 501- 750 మంది ఉంటే రూ.15 వేలు, 750కి పైగా విద్యార్థులుంటే రూ.20 వేలు విడుదల చేయాలి.
వెంటనే నిధులు విడుదల చేయాలి..
ప్రభుత్వం వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు పారిశుధ్య నిధులు విడుదల చేయాలి. చాలా జిల్లాల్లో ఇప్పటివరకు పారిశుధ్య నిధులు విడుదల కాలేదు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు నిధులు విడుదల చేయాలని ఇప్పటికే మా సంఘం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖను సైతం రాసింది.
పి.రాజభాను చంద్రప్రకాష్,
గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం
అధ్యక్షుడు