- 2.98 కోట్ల వ్యయంతో 15 వేల కొత్త ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల కొనుగోలు
- సీఎస్‌ఆర్ స్కీంలో కైదమ్మకుంట పునరుద్ధరణ
- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలో 14 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద చేపడుతున్న మల్టీలెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ నిర్వహణను అత్యధిక బిడ్డింగ్ దాఖలు చేసిన నవ నిర్మాణ్ అసోసియేషన్ సంస్థకు అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రేటర్‌లో కొత్తగా 15,500 ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు కొనుగోలు చేసేందుకు రూ. 2.98 కోట్లకు పరిపాలన అనుమతి, షార్ట్ టెండర్లను పిలవడానికి కమిటీ ఆమోదం తెలిపింది.
జీహెచ్‌ఎంసీ 5వ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలితో పాటు పలువురు స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 14 అంశాలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. కేబీఆర్ పార్క్ ఎంట్రీ గేట్ వద్ద స్మార్ట్ పార్కింగ్ అభివృద్ధి, నిర్వహణను నవనిర్మాణ్ సంస్థకు అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు రికమండ్ చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది.
శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని కైదమ్మకుం టను సీఎస్‌ఆర్ కింద పునరుద్ధరించడానికి మల్లిగావద్ ఫౌండేషన్‌తో ఆరు నెలల కాలానికి జీహెచ్‌ఎంసీ ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఆమోదిస్తూ తీర్మానించారు. వీటితో పాటు మరో 12 అంశాలను కమిటీ ఆమోదించింది.
* బండ్లగూడ జంక్షన్ నుంచి ఎర్రకుంట జంక్షన్ వరకు 100 అడుగుల రహదారి విస్తరణ, అభివృద్ధికి ఎస్‌ఆర్‌డీపీ కింద రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డుకు 44 ఆస్తులు సేకరణ చేసేందుకు పరిపాలనాపరమైన మంజూరు కోరుతూ రాటిఫికేషన్ సిఫార్సుకు ఆమోదం తెలిపారు.
* షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో ఎక్సెస్ రోడ్డు కేటాయింపునకు హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ టీ సురేఖ, విజయలక్ష్మీలకు చెందిన ప్లాట్లకు సంబంధించి చదరపు గజానికి రూ. లక్ష చొప్పున చెల్లింపుపై ఎన్‌వోసీ కోసం ఆమోదం తెలిపారు.
* శేరిలింగంపల్లి మండలం మజీద్ బండ కుడికుంట నాలాకు రూ. 3.96 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రామ్ వాటర్ ఆర్‌సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి పరిపాలన అనుమతి, టెండర్ పిలిచేందుకు కమిటీ ఆమోదించింది.
* చందానగర్ సర్కిల్‌లో కేఎస్‌ఆర్ లేఅవుట్ వద్ద సీఎస్‌ఆర్ కింద 43,600 చదరపు అడుగులలో అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధికి మేసర్స్ తువక్కం వెల్ఫేర్ అసోసియేషన్‌తో మూడేళ్ల కాలానికి జోనల్ కమిషనర్ ఎం వోయూ కుదుర్చుకోవడానికి ఆమోదం తెలిపారు.
* శేరిలింగంపల్లి జోన్‌లో సీఎస్‌ఆర్ కింద వివిధ పార్కులలో ప్రతిపాదిత 5 ప్రాంతా ల్లో ఇంజక్షన్ బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలకు అనుమతిచ్చారు.
* గోపన్నపల్లిలో పెంపుడు జంతువుల శ్మశానవాటికను సొంత నిధులతో నిర్మాణం, మూడేళ్ల నిర్వహణకు మేసర్స్ రాగ ఫౌండేషన్‌కు అనుమతి ఇవ్వడానికి తీర్మానించారు.