28-03-2025 01:31:18 AM
రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ఆలోచన బంకుల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ క్యాంటీన్, పార్క్, చిన్నారుల ప్లేగ్రౌండ్
కాటారం, మార్చి 27 (విజయక్రాంతి) : మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాల పై సెర్ఫ్ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని సూచించారు. నియోజకవర్గ, మండల కేంద్రాలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేయాలని తెలిపారు. మహిళల చే చేపట్టే పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని అన్నారు.
మహిళా శక్తి మాల్స్ ఏర్పాటు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా రద్దీగా ఉండే విధంగా చేయాలని అన్నారు.
జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంక్ లను మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద, సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్ లను పరిశీలించి లబ్ధిదారులకు సహాయం అందేలా చూడాలని అన్నారు.
జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద, సాధారణ భీమా అమలు అవుతుందో పరిశీలించి లబ్ధిదారులకు సహాయం అందజేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్ లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ ను ఆదేశించారు.
2022-23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉన్న వివరాలు అందచేయాలని సంబంధిత అదికారులను అన్నారు. గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉందని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దివ్యాంగులను నిర్ధారించేందుకు అవసరమైన పరికరాలు ఆసుపత్రిలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డిఓ నరేష్, ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డా నవీన్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాములు, డిఈఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.