నేటితో ముగియనున్న కార్తీక పౌర్ణమి జాతర
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ‘గూడెంగుట్ట’ను ‘తెలంగాణ అన్నవరం’గా పిలుస్తారు. ఈ గుట్టమీద వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి (సత్యదేవుడి)ని దర్శించుకు నేందుకు ఏడాది పొడవునా భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు.
గూడెంగుట్టలో గత కొన్ని దశాబ్దాల క్రితం వెలసిన సత్యదేవుడి సన్నిధిలో స్వామి వ్రతం చేస్తే కష్టాలన్నీ తొల గి, సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే, కుటుంబ సమేతంగా అనేకులు వచ్చి వ్రతాలు చేస్తుంటారు. జిల్లాలోని వారేగాక రాష్ట్రవ్యాప్తంగాను, ఆంధ్ర, మహారాష్ట్రల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
కలలో కనిపించి, వెలసిన దైవం
సుమారు 60 ఏండ్ల కిందట గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్లు అనే చాత్తాద శ్రీ వైష్ణవుడికి సత్యదేవుడు కల లో కనిపించి.. “మీ గ్రామ శివారులోని రాట్నపు చెవుల కొండపై నేను ఉన్నాను..” అని స్వామి చెప్పాడు. ఆ పెరుమాండ్ల స్వామి కొండపైకి వెళ్లి చూడగా, నిజంగానే అక్కడ ఒక ‘చిన్న విగ్రహం’ కనిపించింది.
ఆయన ఎంతో సంతోషంతో సమీపానగల గోదావరి నదికి వెళ్లి స్నానం చేసి, నదీజలం తెచ్చి అభిషేకం చేశారు. సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించారు. క్రోధినామ సంవత్సరం (1964) మాఘశుద్ధ దశమి రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. అప్పటి నుంచీ ఈ సత్యదేవుని ఆలయం విశేష ప్రజాదరణతో దినదినాభివృద్ధి చెందుతున్నది.
నేటితో ముగియనున్న కార్తీక పౌర్ణమి వేడుకలు
ఏడాది పొడవునా ఇక్కడ ప్రతి పౌర్ణమికీ జాతర జరపడం విశేషం. ఇక, ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమికి భారీ ఎత్తున వేడుకలు జరపడం విశేషం. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం మొదలైన ఉత్సవాలు నేటి (13 నుంచి 15వ తేది వరకు)తో ముగుస్తాయి.
13న విశ్వక్సేన ఆరాధన, తులసీ కళ్యాణం, 14న బలిహరణం జరగ్గా, ఇవాళ (15న) మహాపూర్ణాహుతి హోమంతో ఉత్సవాలు ముగుస్తాయి. కార్తీకమాసంలో ఎవరి నోట విన్నా గూడెం సత్యదేవుడే వినిపిస్తాడు. నెల పొడుగునా, రోజూ వందలాది మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతా లు ఆచరిస్తారు.
అయ్యప్ప, భక్తాంజనేయ, సాయిబాబా ఆలయాలు
ఈ సత్యదేవుడి ఆలయ సమీపంలో మరో గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయం, గుట్టకింద సాయిబాబా గుడి, గోదావరి తీరంలో భక్తాంజనేయ స్వామి మందిరం ఉన్నాయి. అనేకమంది అయ్యప్ప దీక్షలు ఇక్కడ్నించి ప్రారంభిస్తారు. ఈ అయ్యప్ప ఆలయంలో మాలధారణ చేసుకుంటారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, భక్తాంజనేయ స్వామిని దర్శించుకొంటారు.
ముత్యం వెంకటస్వామి
మంచిర్యాల, విజయక్రాంతి