29-04-2025 12:58:51 PM
కాంగ్రెస్ నాయకులకు 20,000 ఇచ్చిన భయ్యా కనకయ్య ఆవేదన
తుంగతుర్తి మండలంలో పలు గ్రామాల్లో ఇదే తంతు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలి
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేద ప్రజల ప్రయోజనార్ధము ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) నిర్మించాలని పథకం ప్రవేశపెట్టగా ఒకపక్క అధికారుల నిర్లక్ష్యం, మరొక ప్రక్క ఇందిరమ్మ కమిటీల నాయకుల అవినీతి తీరుతో, లిస్టులో పేరు నమోదు కాకపోవడంతో గ్రామాల్లోని అమాయక ప్రజలు మోసపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వెలుగుపల్లి గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య, తండ్రి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాదా, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ముందస్తుగా ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుందామని అడగగా, డబ్బులు ఇస్తేనే ఇస్తామని తెలుపగా కమిటీలోని ఓ నాయకునికి మొదటి దఫలో రూ.20,000 ఇచ్చి లిస్టులో పేరు లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన సంఘటనపై మనస్థాపానికి గురై గ్రామంలోని నీటి ట్యాంకు నెక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నించగా గ్రామస్తులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లి అతనిని బతిమిలాడి, పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పేద ప్రజలకు ఇల్లు వస్తాయి అని ఇందిరమ్మ రాజ్యములో ప్రజలు నమ్ముతుండగా, కమిటీల పేరుతో దోచిన కాడికి దోచుకుందామని నాయకులు గ్రామాల్లో తయారు కావడం గమనార్వం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని ప్రజలు ,వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు .