05-03-2025 12:09:05 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి4( విజయ క్రాంతి): గంజాయి సాగు చేసిన వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, రూ: 50 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ మంగళవారం తీర్పునిచ్చారు. సిర్పూర్ (యు) ఎస్త్స్ర రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..24 అక్టోబర్ 2021 సంవత్సరంలో పక్క సమాచారం మేరకు మధుర తండా గ్రామ శివారులో పత్తి చేనులో భాను దాస్ గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అప్పటి ఎస్ హెచ్ ఓ గంగారాం, ఎస్త్స్ర విష్ణువర్ధన్ తనిఖీ చేయగా గంజాయి చెట్లు లభ్యం అయ్యాయి.
సోయం లక్ష్మణ్ కు చెందిన నాలుగు ఎకరాల చేనును భాను దాస్ కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేయడంతో పాటు అత్యాశతో గంజాయి సాగు చేశాడు. భాను దాస్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా పి పి జగన్మోహన్రావు సాక్షులను ప్రవేశపెట్టారు. న్యాయ మూర్తి సాక్షులను విచారించి నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పును ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన ఏఎస్పి చిత్తరంజన్, సీఐ రమేష్, ఎస్త్స్ర రామకృష్ణ, కోర్టు లిజనింగ్ అధికారి రాంసింగ్, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.