calender_icon.png 25 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనిషి వాక్యం

25-11-2024 12:00:00 AM

గాయాల మొరటునుంచి

కంటిపాప కలలు దారితప్పి

వాస్తవిక దారులపై 

పరుగు అరుగులు మొలిచెను

వెలుగు పూసిన శూన్యంలో

ఆశల రేఖలు వెలిసి

అజ్ఞానాంధకార పొరలను 

తొలిచే ఆయుధం

మేధస్సు పొరల్లో ఉద్భవించింది

నేలపై చెమట పాదాలను ముద్దాడినప్పుడల్లా

కట్టెల పొయ్యిమీద రొట్టె నాట్యం చేస్తుండేది

నాలుగు ఆకులు మిగిలే చెట్టుకు

మూకుమ్మడిగా ముడుపులు కట్టి

రాతీగల శిలపై కొబ్బరికాయ స్నానాలు చేసేవి

మూఢనమ్మకపు ఆచారాలతో

కనబడుతున్నది నమ్మలేక

వినబడుతున్నది వినలేక

దురాచారం ఆందలమెక్కి కూర్చున్నది

జీవిత తెరలపై మొగ్గలు వేస్తూ

తీరం తెలియని నావపై ప్రయాణం చేసేవి

పచ్చని సంతకాల బువ్వ మెతుకులు

ఆకాశరామన్న ఉత్తరం కోసం 

ఎదురుచూపులకై ఎదురుచూసేవి

ప్లాస్టిక్ నవ్వుల నాటక పాత్రలో

రంగుముఖాలు చూపే అద్దాలు మసకబారినవి

కొలమానం లేని స్వార్థచింతన ఉయ్యాలలో

మనిషి బతుకు వాక్యం తిరగబడిన స్వాప్నికం.

- డా. పగిడిపల్లి సురేందర్