భార్య ఫొటోలు మార్ఫింగ్
తట్టుకోలేక భర్త ఆత్మహత్య
విచారణ చేపట్టిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : తీసుకున్న రుణం చెల్లించినా లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తగ్గకపోవడంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన వినోద్‌కుమార్ భార్యతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా లోన్‌యాప్‌లో రూ.2,514 రుణంగా తీసుకున్నాడు.
అయితే సకాలంలో లోన్ చెల్లించకపోవడంతో లోన్‌యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వినోద్ కుమార్ భార్య ఫోటోను మార్ఫింగ్ చేసిన లోన్‌యాప్ నిర్వాహకులు.. అతడి స్నేహితులు, బంధువులకు పంపించారు. దీంతో లోన్ గురించి తెలుసుకున్న మంజుషాదేవి సోదరుడు రుణం పూర్తిగా చెల్లించాడు. అయినా కూడా ఇంకా డబ్బులు కట్టాలని లోన్‌యాప్ నిర్వాహకులు వినోద్‌కుమార్‌పై ఒత్తిడి తేవడంతో విసుగుచెందిన వినోద్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.