05-03-2025 10:18:45 PM
ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరిక...
హైదరాబాద్: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం.78 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి.. స్థానిక జీఎంను లీకేజికి కారణాలు అరా తియ్యమని ఆదేశించారు. దీంతో ఓ అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్ తో వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం ఎండీకి విన్నవించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు.
అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత జనరల్ మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూరు ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. కాబట్టి నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది.
ఇప్పటికే నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడదని విజ్ఞప్తి చేస్తోంది. జలమండలి జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.