12-03-2025 10:40:32 PM
పాపన్నపేట: పాముకాటుతో అస్పత్రి లో చేరి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లక్ష్మీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వంగపాటి నాగరాజు(53) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పుడప్పుడు ఎక్కడైనా పాములు వస్తే వాటిని పట్టేవాడు. మంగళవారం సాయంత్రం కొత్తపల్లి గ్రామంలో ని అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో పాము ఉందన్న సమాచారం తో ఆ పామును పట్టేందుకు అక్కడికి వెళ్లి పట్టే క్రమంలో చేతికి పాము కాటుకు గురయ్యాడు. అక్కడే ఉన్నవారు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.