15-04-2025 11:01:07 PM
మూసాపేట: మండల పరిధిలోని వేముల గ్రామ శివారులో స్వల్ప వాన భారీ ఈదురుగాలులు వేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యమ్మ (75) అనే మహిళ వారికి ఉన్న రెండు ఎకరాల్లో వరి సాగు చేసింది. పంట చేను మొదలు పూర్తయిన తర్వాత వరి ధాన్యాన్ని వేముల గ్రామ పరిధిలోని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా స్వల్ప వాన చినుకులతో పాటు భారీ ఈదురు గాలులు వీయడంతో అయ్యమ్మ పక్కనే ఉన్న ఒక డబ్బా దగ్గర తల దాచుకున్నది.
తీవ్రంగా ఈదురు గాలులు వీయడంతో డబ్బా ఒకసారిగా ఆమెపై పడింది. రేకుల డబ్బా కావడంతో ఆమె ముఖానికి శరీర భాగాలకు రేకులు తగిలాయి. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఊపిరాడక అక్కడికక్కడే అయ్యమ్మ మృతి చెందింది. మృతి రాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు శ్రమించిన మహిళ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛయాలు అలుముకున్నాయి.