calender_icon.png 26 December, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

25-12-2024 04:00:05 PM

గ్రామంలో తరచూ దొంగతనానికి పాల్పడుతున్నాడని కొట్టి చంపినట్లు అనుమానం.   

రాత్రికి రాత్రే శవాన్ని పొలంలో పూడ్చిపెట్టిన కులస్తులు, వారికి మద్దతు తెలిపిన గ్రామస్తులు.  

పోలీసులకు తెలిసినా పట్టించుకోని వైనం. 

నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో వెలుగులోకి అమానవీయ ఘటన.

నాగర్ కర్నూల్  (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... వనపట్ల గ్రామానికి చెందిన జావుల నరసింహకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరిగగా చిన్న కుమారుడు జావుల మల్లయ్య (దొంగ మల్లి) (30) పెళ్లి చేసుకోకుండా గ్రామంలో తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. దీంతో ఆయా బాధితులంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విసిగి వేశాగారు. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు ద్విచక్ర వాహనాలు వంటి వాటిని దొంగిలించి సుదూర ప్రాంతాల్లో వదిలేస్తుండేవాడు. వ్యవసాయ పనిముట్లు బోరుబావుల వద్ద విలువైన వస్తువులు, తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి నగదు దొంగిలిస్తూ దొంగతనాన్ని తన ఇంటిపేరుగా మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. తరచూ ఇలాంటి దొంగతనాలతో గ్రామస్తులంతా విసిగి వేసాగిపోయారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ఓ ఇంట్లో 50 వేలు నగదు చోరీ చేసి మద్యం తాగినందుకు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో తన అన్న వదినలపై దాడి చేయడంతో అన్న వదినలిద్దరూ పక్కనే ఉన్న దేశిటిక్యాల గ్రామానికి వెళ్లారు. ఆ మరుసటి రోజే మల్లయ్య శవమై కనిపించడంతో ఇతని మృతిపై అనుమానాలు రేకెత్తయి.  కొందరు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తుండగా మరికొందరు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. ఆకస్మిక మృతి పట్ల పోస్టుమార్టం చేశాకే కనణం చేయాల్సిన మృతదేహాన్ని రాత్రికి రాత్రే జెసిబి సాయంతో పొలంలో పూడ్చి పెట్టడంతో అతని మృతిపై పలు అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. తరచూ దొంగతనానికి పాల్పడుతుండడంతో కుటుంబ సభ్యులు, కులస్తులే విసిగి వేసాగి దాడి చేసి హతమార్చారా లేక గ్రామస్తులే అతనిపై కక్ష పెంచుకొని దాడి చేసి చంపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల పోలీసుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.