18-02-2025 04:44:52 PM
పాపన్నపేట: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ (25) ఉపాధి నిమిత్తం రాష్ట్రనికి వచ్చి మొదటగా కామారెడ్డి జిల్లాలో గప్ చుప్ బండిని నిర్వహించేవాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న శ్రీలత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు.
గత కొన్ని నెలలుగా మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో గప్ చుప్ బండిని నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసగా మారాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో భార్య కామారెడ్డి జిల్లాలోని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసై మనస్తాపం చెంది సోమవారం రాత్రి సమయంలో అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.